సిలువ యందలి విశ్వాసము విశ్రాంతి

గలతీ. 2:17-21

 ప్రార్దన:- నా నిమిత్తమై సిలువ శ్రమను అనుభవించిన తండ్రీ! నీకు స్తోత్రములు. నీ శ్రమను నమ్ముట ద్వారా మాకు విశ్రాంతి కలుగును. విమోచన దొరుకును. అట్టి విశ్రాంతిని, విమోచనను కల్గించుటకు నీ వర్తమానమిమ్ము వందనములు. ఆమేన్.

ఈ వాక్యములో ఏమున్నదనగా, “క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను ” ఇంకను ప్రభువైన యేసు తనకు తానే సిలువ మరణమునకు అప్పగించకొనడము ఉన్నది.

  1. ఈ దినము ప్రభువునకు శ్రమ దినము. మనకు సంతోష దినము.
  2. మనము కృతజ్ఞత చూపించే దినము.సంతోషముతో వందనములు ఆచరించే దినము.

ఈ దినము సంతోష దినముగాని దుఃఖ దినముకాదు. ఇది ప్రభువుకు బాధకరమై యుండెను గాని మనకు బాధ తీసివేసే దినమైయుండెను. ఈ దినము యేసుప్రభువు చూపిన ప్రేమ నిమిత్తమై స్తుతి చేసే దినము. పరిశుధ్ధ లోకములో పాపము ప్రవేశించినది. పాపమువల్ల వ్యాధి వచ్చినది. వ్యాధివలన బాధ వచ్చినది. బాధవల్ల మరణము వచ్చినది. తరువాత నరకము వచ్చినది. దీనికే రెండవ మరణమని,నిత్యనరకమనిపేరు. పాపమువల్ల సిగ్గు వచ్చినది, భయము వచ్చినది. సిగ్గువల్ల దాగుకొనుట,భయము వల్ల దాగుగొనుట, దేవునికి దూరమై పోయినాము అనే చింత కల్గుట. దేవునికి దూరమై పోవుటకూడా మరణమే, ఇది గొప్ప మరణము. ఇదే ఆత్మీయ మరణము. పాపమువల్ల నేరము మోపుట వచ్చినది. సిగ్గు, భయము, వ్యాధి మొదలైన పాప ఫలితములు వచ్చినవి. పాపమువల్ల భూమి శపింపబడినది.ముండ్ల పొదలు గుచ్చుకొంటున్నవి. శాపమువల్ల పంట పండక పోవుటను బట్టి, కరువు కలుగును. తెలియక అడుగేస్తే ముల్లు గుచ్చుకొనును. ఇది అజ్ఞానము. ఒక్కొక్కసారి తెలిసికూడ అజాగ్రత్తగానుందుము. ఇదికూడ పాపఫలితమే.

     ప్రేమకు బదులు కోపము. శక్తికి బదులు బలహీనత, పరిశుద్ధతకు బదులు పాపము, శుభ్రతకు బదులు అనాగరికత, జ్ఞానమునకు బదులు అజ్ఞానము (అజాగ్రత్త), జీవమునకు బదులు మరణము, స్వతంత్రతకు బదులు విచ్చలవిడిగా తిరిగి మతి చెడిపోవుట మరియు అవిధేయత; పైవన్నీ పాపము వలన వచ్చినవి. గాని చివరకు ఇవే పాపములైపోయినని. జ్ఞానముయెుక్క కళ తగ్గినందువల్లనే మనము బైబిలు చదువుచున్నాము గాని సరిగా గ్రహించలేక పోవుచున్నాము, మన శక్తికి కళ తగ్గినందున పెద్దపులి వస్తే పారిపోతున్నాము. మన పరిశుద్ధతలో కళ తగ్గినందున పాపములో పడుతూ, లేస్తూ, ఒప్పుకొంటూన్నాము. నిలకడైన పరిశుద్ధత లేదు . మన జీవములో కళ తగ్గినందున, మన కాలములో ఎక్కువ సంవత్సరములు జీవించలేక పోవుచున్నాము. మన స్వతంత్రతకు కళ తగ్గినందున విచ్చలవిడిగా నుండి చెడిపోవుచున్నాము.

    షరా: పాపము దేవుని ఆజ్ఞను అతిక్రమించుటవలన వచ్చెను. ఒక పాపమువల్ల ఇంకొక పాపము ఏలాగు పుట్టునో, అలాగే ఒక నష్టమువల్ల ఇంకొక నష్టము పుట్టును. పాపమువలన నష్టము రావడము మాత్రమే కాదు, రావలసిన మేలు రాదు. ఇవన్ని అయన సిలువ మ్రాను  మీద  వేసికొనెను. ఇవన్నియు ప్రభువు సిలువమ్రానుమీద మోసినాడు. ఇవన్నియు ప్రభువు సిలువ మ్రాను మీద మోసినాడని పూర్తిగా నమ్మలేము గనుక ఇదే అపనమ్మిక. ఇది పావమువలన వచ్చినది. ఒక చిన్నవాడు బూడిదలోనున్నాడు. కడుగబడిన తరువాత మరలా బూడిదలోనికి వెళ్ళాడు. ఆలాగే మానవుడు పాపము మానివేసి, మరల పాపములోనికి వెళ్తాడు. పాపమువల్ల నరకము వస్తుంది లేదా పెండ్లీకుమార్తె వరుస తప్పిపోతుంది అని భయపడి, పాపము మానివేస్తామనే పిరికి వారికి హానిలేని రక్షణ ఉన్నది. రక్షణ కొరకు ఆశించి పాపము మాని వేస్తే మంచిదేగాని అందును బట్టి వారికి రక్షణ ఉండదు. ప్రభువు మీద అనుకొంటే రక్షణగాని ఒక మంచి కార్యము మీద ఆనుకొంటే రక్షణరాదు.

  1. సిలువను నమ్మాలి. నా మీదనున్న దంతా ఆయన సిలువమీద వేసికొన్నాడు. నా బాధలన్ని తీసివేసినాడు.
  2. తన పునరుత్థానమువల్ల మేళ్లన్నీ ఇచ్చినాడు, మరణము యెుక్క ముల్లు తీసివేసినాడు. ఆత్మకు హానిరాకుండా దుష్ట ఫలితములన్నిటి ముల్లు తీసివేసినాడు. జబ్బుపైకి ఉన్ననూ, అది ఆయన ప్రేమే. విశ్వాసులకు కష్టములు వస్తే అవి ప్రభువు ఉంచివేయును గాని వాటిముల్లు తీసివేయును. అనగా ఆపదలవల్ల ఆత్మకు నష్టము కలుగకుండా కాపాడును, దేవుని లక్షణములు ప్రేమ, న్యాయము. ఆయన ప్రేమక్రింద నిలబడితే, అంతములేని నరకమును తీసివేయును. ఆయన గుణములు అంతము లేనివి. మంచి శుక్రవారమునకు ఇతరపేర్లు. 1) మహాయజ్ఞ దినము, 2) ప్రాయశ్చిత్త దినము. శుక్రవారమునకు ‘మంచి శుక్రవారమని’ సంఘముపేరుపెట్టినది గాని, బైబిలులోని పేరు ఏ దనగా “కడు ప్రాయశ్చిత్త దినము”. అనగా 1) మనము పొందవలసిన శిక్షను ప్రభువు పొందిన దినము. 2) బలిదినమున యూదులు గొర్రెపిల్లను సిలువవేసినారు. దేవుడు తన కుమారుని బలివేసినాడు. 3) సిలువ అనే పేరు బైబిలులో లేదు. అది అరవ దేశమునుండి వచ్చిన మాటగా తెలుగు బైబిలులో ఉన్నది. తెలుగు భాషలో ‘కొరత వేయుట’ అనే మరియొక పేరున్నది. అనగా సిలువకు వధ్య స్ధంభము లేదా కొరతవేయుట అని పేరు. యూదులు ఈ రోజున పండుగ చేస్తారు. గొర్రెపిల్లను బలివేస్తారు. తమ పాపములన్నియూ ఆ గొర్రెపిల్ల మీద వేసినాము గదా! అని ప్రాయశ్చిత్త పండుగ, బలిపండుగ జరిపిస్తారు. ఈ ఒక్కరోజే సంవత్సరము అంతటిలో దేవునికి విశ్రాంతి రోజు. ఎందుకంటే ఈ దినము పిశాచి మనమీద చాడీలు చెప్పడు. ఈ దినము మన మంచిశుక్రవారముతో సమానమైయున్నది. వారు ఒక మాట అనుచున్నారు. ఈ వేళ దేవునికి విశ్రాంతి, దేవుడెవరినిగూర్చి చాడీలు వినడు. సిలువమీద వేయబడిన వారెవరో, అందరు ఆ సిలువమీద కొరత వేయబడిన వానినే ఆశ్రయించవలెను. సిలువమీద ఆయన రక్తము ఎవరికొరకు ధారపోయబడెను? అందరి నిమిత్తమే గాని విశ్వాసులు మాత్రమే దానిని నమ్ముచున్నారు. ఆ సిలువ మీది రక్తము తన చేత కార్చబడెనని అపవాది తన సైన్యములోని వారిని ప్రేరేపించును. అవి మనిషి దగ్గరకు వచ్చి మనిషిలో ఉన్న దుష్ట నైజమును ప్రేరేపించును. గనుక దుష్టనైజముగలవారు ఆయన సిలువను ఒప్పుకొనరు. గనుక ఈ సిలువ ధ్యానకాలములో మన దుష్టనైజమును సిలువ వేసికొనవలెను.

అట్టి ధన్యత నేడు సిలువ నాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయును గాక! ఆమేన్.

కీర్తన :-  “సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప = కలుష మెల్లను బాపగ జాలును రా” 

                                           “ నీ సిలువే“ 

Share this now. Choose your platform