సిలువలోని నీతి చరిత్ర

కీర్తన. 22:30-31.

ప్రార్థన: దయగల ప్రభువా! నీ ముఖము ఎదుటను, ఈ శ్రమచరిత్ర ఉంచినావు. ఆ వెనుకను ఈ ప్రకారము సంఘములో జరుగుచున్నది. ప్రభువా! నీవు లోకములో నున్నప్పుడు నీకు, నీ ముఖము ఎదుట, నీకు రానున్న శ్రమలన్నీ కనబడుచున్నవి. అవి జరిగి ఇప్పటికి రెండువేల నాలుగు సం,,లు అయినది. మాకు అవి మా వెనుక ఉన్నవి. మేము వెనుకకు తిరిగి వాటిని మా ముఖము ఎదుట పెట్టుకొని ధ్యానించబోవుచున్నాము. గనుక వాటిని మాకు చూపుము. నీ శ్రమలను ధ్యానించిన యెడల మాకు జయము, బలము కలుగును. నీవు దాచిపెట్టిన వర్తమానములు అందించుమని వేడుకొను చున్నాము. నీ శ్రమచరిత్రలో మా శ్రమచరిత్ర జ్ఞాపకము వస్తున్నది. లోకములో శమలున్నవి. అవి మా పాపములనుబట్టి కాదు. నిన్నుబట్టి, నీ వాక్యమునుబట్టి, నిన్ను ప్రార్థించుటను బట్టి, నీ మార్గములో నడచుటవల్ల మాకు శ్రమలు కలుగుచున్నవి. నీవు శ్రమలను లెక్క చేయలేదు. మేమును లెక్కచేయకుండునట్లు కృప దయచేయుము.
నీ శ్రమ చరిత్రలో నీ ఓర్పు, నీ శ్రమలో నీకు కలిగిన జయము కనబడుచున్నవి. నీ శ్రమలలో మాకు ఆదరణ మాటలు ఉన్నవి. ఏడు ఆదరణ మాటలు నీవు పలికినట్లు మేముకూడా ఆదరణ మాటలు పలుకు కృప దయచేయుము. ఏదో ఒక శ్రమ కలిగియున్న మేము నీ ఎదుటికి వచ్చి కూర్చున్నాము. మా శ్రమలకు లెక్కయున్నది. నీ శ్రమలకు లెక్క లేదు. యేసుక్రీస్తును నమ్ముచున్న మీకు శ్రమలు ఎందుకు వచ్చుచున్నవి? అని సైతాను, తెలివిలేని జ్ఞానులు, బుద్ధిలేని మనుష్యులు, మనస్సాక్షి, జ్ఞానము, లోకమును అడుగుచున్నవి. హేళనచేయువారికి శాంతముగా సమాధానము చెప్పు మనస్సు దయచేయుము, మా మాటలు నామకార్థ మాటలు కాక ఆత్మలోనికి, జీవితములోనికి వెళ్లేటట్లు కృప దయచేయుము. నీ శ్రమలు ధ్యానించి మా శ్రమలు మరచునట్లు; మమ్మును నీ తట్టు, నీ శ్రమల తట్టు, నీ జయము తట్టు, నీ నిరీక్షణ తట్టు, బహుమానము తట్టు మా హృదయములను త్రిప్పుము. అవిశ్వాసికి శ్రమలు కలిగినపుడు కన్నీరు రాల్చుట, విసుగుకొనుట, కేకలువేయుట యుండును. విశ్వాసులు అట్లు చేయరు. శ్రమలు వచ్చినపుడు ఇది మా భాగ్యము, ఇది మా బహుమానము, ఇది మా విజయ ధ్వజము, ఇది మా విశ్రాంతి అని అతిశయింతురు. అట్లు
సంతోషించునట్టు మాకు శ్రమ పాఠము నేర్పుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.
ఇది సంఘ చరిత్ర. ఏమి చెప్పవలెను? శ్రమ పాఠములో చెప్పకుండ ఏమి కప్పవలెను? ప్రభుని శ్రమల ఎదుట నా శ్రమలు ఏ మాత్రము! యేసుప్రభువు ఈ లోకములోని శ్రమలన్నీ, తన కాళ్లక్రింద త్రొక్కిపెట్టి పై లోకములోనికి వెళ్లి తండ్రి సింహాసనముమీదనున్నట్లు, మనము శ్రమలు కప్పిపెట్టి మహోన్నత సింహాసన సిలువకు వెళ్లుదుము. అది నలిగిన సిలువ. శ్రమ సిలువ, కర్ర సిలువ కాదు గాని మహిమ సిలువ.
ఒక సంతతివారు ఈ వాక్యములోనున్నట్లు చేయుదురు. ప్రభువుయెుక్క శ్రమ చరిత్ర చూస్తే మొదటి కథ గెత్సేమనే తోటలో ప్రార్థించిన పిమ్మట ఆయనను పట్టుకొన్న కథ. 1) పాపుల చేతులలో పట్టబడుట.2) పంచాయితీ సభలో నిలువబడిన శ్రమకథ ౩) కయప తీర్పులో నిలువబడిన శ్రమకథ. 4) పిలాతు ఎదుట (ఊరిలో) నిలువబడిన శ్రమకథ. 5) ఊళ్లో హేరోదు రాజు ఎదుట జరిగిన తీర్పు శ్రమకథ. 6) ఆఖరు పర్యాయము పిలాతు ఎదుట కోర్టులో నిలువబడిన శ్రమ తీర్పుకథ.7) ఊరిలో వీధిలోబడి, రోడ్డుమీదుగా కొండకు సిలువమోసిన శ్రమ కథ. 8) సిలువమీద వ్రేలాడిన శ్రమకథ 9) సమాధి కథ.
ఈ కథలన్ని టి పొడుగున మనము నడచి, ఆ కథలలోని నీతిబోధ కొద్దిగా వినవలెను. ఈ కథలన్నిటికి ముందు జరిగిన కయప కథ, తరువాత మల్కు కథ.
1. కయప:- క్రొత్త పెద్ద పూజారి. ఇతడు సభలో యూదులకు ఆలోచన చెప్పెను. ప్రభువుమీద శాస్త్రులు, పరిసయ్యులు కుట్రాలోచన చేయుచున్నారు. కయప:- 1) ‘యేసు అద్భుతములు చేయగా ప్రజలందరు ఆయనను వెంబడించుచున్నారు. 2) యేసు బోధ వినుటకు ప్రజలంతా ఆయన వద్దకు వెళ్లిపోయినారు, ప్రజలందరు మనలను విడిచివెళ్తే, మన దేశమంతయు ఖాళీ అయిపోయి, మన శత్రువులు వచ్చి మన స్థలమును ఆక్రమించుకొందురు. మన జనమును ఏలుబడి చేయుదురు. గనుక మనమే ఈ ప్రజలతో మీరు ఆయన వద్దకు వెళ్లవద్దని చెప్పవలెను. ప్రజలను ఆపుచేయవలెను. అక్కడకు వెళ్లవద్దని మనము యేసుకు చెప్పపలెను” అని క్రొత్త పూజారి ఆలోచన చెప్పెను. ‘మీ ఆలోచన సరిగాలేదని మీరు తెలిసికొనలేదు. మన ప్రజలు నశింపకుండు నిమిత్తము తాను శ్రమ పొందుటకు వచ్చినానని ఆయన చెప్పుచున్నారు. మన శాపము పోవు నిమిత్తము తాను చనిపోవుటకు వచ్చినాడని చెప్పుచున్నారు. ఇది మనకు మేలే గదా! మనమందరము నశింపకుండు నిమిత్తము ఆయనను చంపివేయవలెను’ అని సభవారికి కయప ఆలోచన చెప్పినాడు. ఆ సభలో కయప ఒక్కడే ప్రభువు పక్షముగా ఉండెను. ఆయన మంచి పనిచేస్తున్నాడు, మంచి బోధలు చేస్తున్నాడు గనుక చేయనివ్వండి.
2. సన్‌హెడ్రిన్ సభవారు కూడుకొన్నారు. ప్రజలు ఆయనవద్దకు వెళ్లకుండా చేయుట ఎట్లు? ఆయనను (యేసుక్రీస్తును) అట్టి అద్భుతములు చేయకుండ నాశనము (ఖూనీ) చేయజూచిరి. ప్రభువు చేయు మంచి పనులకు, బోధలకు సంతోషించక ఆయన మీద చెడ్డమాటలు కల్పించినారు. ఆయనను హింసించువారున్నారు గాని ఆయన పక్షముగా ఒక్కరైనా లేరు.కయప ఒక్కడే ఉన్నాడు.
అట్లే మన బైబిలుమిషను పక్షముగాను, మన పక్షముగాను ఒకరైనను ఉంటారు. స్వస్థిశాలలను గురించి మన బోధలను గురించి ఎదిరించువారు, దూషించువారు, తిట్టువారున్నారు. కయప ప్రధానయాజకుడు, అయితే, కయప ప్రవక్తగా మారిపోయినాడు. గనుకనే ప్రభువును గూర్చి ప్రవచించెను. ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన ముగించి, గేటువద్దకు రాగా ఎదురుపడిన జన సమూహములో ప్రధాన యాజకుని దాసుడైన మల్కును పేతురు కోపపడి నరకగా చెవి తెగిపడినది. మల్కు అనారోగ్యవంతుడైనాడు. ప్రభువు అతని చెవి అతికించి బాగుచేయగా ఆరోగ్యవంతుడైనాడు. అతడు మారినాడు గాని ఇది చూచిన ఆ ప్రజలు మారుమనస్సు పొందలేదు. ప్రభువు శ్రమలో, మొదటి శ్రమలో మారిన కయప ప్రవక్తగా మారినాడు. అట్లే పోకిరి గుంపులో కేకలు వేసిన వారిలో, చెవి నరకబడిన అనారోగ్యవంతుడగు మల్కు ఆరోగ్యవంతుడుగా మారిపోయినాడు. ప్రభువువద్ద మారినాడు. ప్రభువువద్ద నున్నవారుకూడ ఆలాగేమారవలెను. అనారోగ్యవంతులు, ఆరోగ్యవంతులుగా మారవలెను.
3. పేతురు కోర్టువద్దనున్నప్పుడు, అక్కడినారు ‘నీవు క్రీస్తుతో నున్నవాడవుగదా!’ అని అడుగగా పేతురు జంకెను. కోడికూసినపుడు ప్రభువు పేతురువైపు చూడగా పేతురుకు అది బాణమై గుచ్చుకున్నది. పేతురు కోర్టు వెలుపలికి వెళ్లి సంతాపపడి ఏడ్చేను. దుఃఖాక్రాంతుడుగా మారెను. పేతురు మొదట భక్తుడు, పిమ్మట భక్తిహీనుడు, ఆ తరువాత మరలా భక్తుడుగా మారెను. 1) కయప, 2) మల్కు, 3) పేతురు.
4. పిలాతు కోర్టులో ప్రభువు తీర్పు శ్రమ పొందుచుండగా, అతని భార్య నాకు కల వచ్చినది. ఆయన నీతిమంతుడు సుమా! “ఆ నీతిమంతుని జోలికి పోవద్దు” అని ఆమె ఆయన నీతిపరుడని సాక్ష్యమిచ్చెను. ఆ కోర్టు ఎదుట, అధికారియగు భర్త ఎదుట ఆయన నీతిమంతు డని ఒప్పుకొని సాక్ష్యము చెప్పునంతగా ఆమె మారెను. ఆయన నీతిపరుడని తెలిసికొనగల జ్ఞానవంతురాలుగా మారెను, ధైర్యశాలిగా మారెను. పేతురుకు అట్టి ధైర్యము లేకపోయెను. స్వప్నము ఆధారము చేసికొని గొప్ప సాక్షిగా మారినది, కయప యూదుడు. ప్రభువు యూదుడు. యూదుడు యూదుని గూర్చి సాక్ష్యమిచ్చుట గొప్పకాదు గాని అన్యురాలిచ్చినది. ఇది గొప్పది.
5. ప్రభువుతో దొంగలు సిలువ వేయబడెను. ఏ బోధ విని కుడివైపు దొంగ మారెను? బోధలేదు గాని ఆయన శాంతమును చూచి మారెను. ‘నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుమని’ ప్రార్థించి, ప్రార్థనాపరుడుగా మారెను. దొంగ పరలోకములో దొరయైనాడు.

6. సిలువ ప్రక్కన జరిగిన మరొక కథ. శతాధిపతి అనగా 100 మందికి అధిపతి. సిలువ వేయునపుడు అల్లరి జరుగకుండా చూచుటకు అతడు అక్కడుండెను. అతడు భక్తుడు కాదు, లౌకికుడు. భూకంపము జరుగగా అద్భుతము జరిగినది. ఈయన మరియ కుమారుడు, యోసేపు కుమారుడు అనుకొన్నాను గాని ఈయన ‘నిజముగా దేవుని కుమారుడని’ సాక్ష్యమిచ్చెను. ప్రభువు కోర్టులో అన్నదికూడ ఇదే. అక్కడ అడిగినవారు పిలాతు. నీవు దేవుని కుమారుడవా? అని అంటే నీవన్నటే అనెను. అప్పుడు అనగా ప్రభువు చెప్పినప్పుడు నేను నమ్మలేదుగాని ఇప్పుడు నేను నమ్ముచున్నానని శతాధిపతి అనెను. ‘నిజముగా’ అని సాక్ష్యమిచ్చెను.
శతాధిపతి ఒక్క 100 మందికే అధిపతిగాని అక్కడ ఆ వందమందే కాదు అనేకులున్నారు. అక్కడ ఆ ‘నూరుమంది’, యూదులు, అన్యులు అనేకులు ఇక్కడ ఉన్నారు. వారందరియెదుట ‘నిజముగా దేవుని కుమారుడని’ శతాధిపతి సాక్ష్యమిచ్చెను. 1952 సం,,మునకు 80 కోట్లమంది, ప్రభువు నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యము వినియున్నారు. ఆ మొదటి శతాబ్ధము నుండి ఇప్పటివరకు కోట్లకొలది ప్రజలు ఆ వార్త విన్నవారిలో ఉన్నారు. 100 మందికే అధి పతియైన ఆ శతాధిపతి నేడు కోట్లకు అధిపతియాయెను. పేతురు సాక్ష్యమిచ్చెను – ఆయన నా గురువని. దొంగ – ప్రారప్రార్థించెన. శతాధిపతి – గొప్ప సాక్ష్యమిచ్చెను. అనేకమంది క్రీస్తు దేవుడనుకొనుచున్నారు. అయితే, ఎవరు ఇట్టి సాక్ష్యము ఇవ్వగలరో వారే గొప్ప సాక్షులు. శతాధిపతివలె సాక్ష్యమిచ్చే వారు అనగా సాక్ష్యమిచ్చుటలో ఆయన కుడిప్రక్కను నిలువబడే వారే, గొప్ప వేదాంత పండితులు.
7. ప్రభువునొద్దకు రాత్రి రహస్యముగా వచ్చిన నికోదేము, ముసలి వేదాంత పండితుడు. ప్రభువు ఎవరో! ఆయన నాకు ఏమి చెప్పునో, అని రాత్రివేళ ప్రభువు దగ్గరకు వెళ్లెను. ఆయన రాత్రికాల వ్యక్తి. ప్రభువు భోజనముచేసి, కూర్చుండి నికోదేము వచ్చునని కనిపెట్టుచుండెను. నికోదేము వచ్చి ప్రభువుతో సంభాషించి మారెను గాని ప్రభువునకు 33 1/2సం||ల వయస్సు వచ్చేవరకు రహస్యముగా నుండెను గాని ప్రభుని శ్రమానంతరము అనగా ప్రభువు మరణమైన పిదప, బహిరంగ శిష్యుడుగా బైటికి వచ్చెను. ప్రభుని శరీరమునకు పూయుటకు 156 సేర్లు అగరు తెచ్చెను. రాత్రికాల శిష్యుడు ఈ శ్రమ చరిత్రవల్ల పగటికాల శిష్యుడుగా మారెను.
8. యేసుప్రభువునకు వ్యతిరేక సభ ఒకటున్నది. అందులో మంచివాడు అరిమతయియ యోసేపు. ఈయన ధనికుడు, ఘనుడు, సజ్జనుడు, రహస్య శిష్యుడు. ప్రభువు చనిపోగానే పిలాతునొద్దకు వెళ్లి ప్రభుని శవము అడుగగా, పిలాతు అతనికి ప్రభుని శవమును ఇచ్చెను. నికోదేము,అరిమతయియ యోసేపు, ప్రభువు సహోదరుడైన యోహాను ఆయనను సమాధి చేసిరి. యోసేపు విలువగల సన్నని నారబట్ట కొనెను. యోసేపు తన కొరకు తొలిపించుకొనిన సమాధిలో ప్రభుని పెట్టెను. ప్రభుని శ్రమవల్ల అరిమతయియ యోసేపు మారెను. ఆయన శ్రమలవల్ల ఎందరు మారిరో లెక్కవేయండి. మీరు మారినట్లైన ఆ మారిన వారిలో మీ లెక్కకూడ లెక్కించండి.
అట్టి కృప త్రియేక దేవుడు నేడు మీకు దయచేయును గాక. ఆమేన్.
ప్రార్థన :- ప్రభువా! నీ శ్రమకాలములో ఎందరిని మార్చినావో, పరలోకము వెళ్లిన తరువాత ఎందరిని మార్చినావో!! ఇక్కడున్న మమ్మును మార్చినావు గనుక నీకనేక స్తోత్రములు. ఆమేన్.
కీర్తన :-
సిల్వయొద్ద జేరుదున్
బీద హీనయంధుడన్
లోకమున్ త్యజింతును
పూర్ణముక్తి నొందుదున్‌

కర్త నిన్నే నమ్ముదున్
కల్వరీ గొర్రె పిల్లా
మోకరించి వేడెదన్
నన్ను గావుమో ప్రభో!!”

Share this now. Choose your platform