సెలవు ద్వారా కలిగే మార్పు – మారలేని యూదా
యోహాను 1:2-3.

ప్రార్థన:- యేసుప్రభువా! తీర్పు శ్రమలో నిలబడిన ప్రభువా! సిలువను నీ మీద వేసికొన్న యేసుప్రభువా! నీ చరిత్ర ముందు నడిచివెళ్లుచుండగా అనేకమందికి మార్పు కలిగినది. నేటివరకు అట్టి మార్పు కలుగుచూనే యున్నది. నీ సిలువ చరిత్ర మార్పు కలిగించలేనట్టి ఒక వస్తువు కూడ ఈ లోకములో లేదు. ‘కలిగియున్నది ఏదియు నీవు లేకుండా కలుగలేదు’. గనుక సృష్టిలో నీవు చేసిన ప్రతి వస్తువు ద్వారా ఒక మార్పు కలిగించుచున్నావు. నీవు సూర్యుని కలిగించినావు. ఆ సూర్యుని ద్వారా ప్రతి వస్తువునకు, సృష్టి అంతటికి మార్పు కలిగించుచున్నావు. పువ్వులు రకరకములు. వాటికి రకరకమైన రంగులు సూర్యుడు లేకుండా రావు. అది జరుగదు. ఏ సూర్యుని కలిగించినావో ఆ సూర్యుని వల్ల వస్తువులను మార్చే శక్తి కలిగించినావు, నీవు కలుగ జేసిన వృక్షములలో మార్పు ఏదనగా, వృక్షము వృక్షముగానే యుండును గాని దానిక్రింద నీడ కలిగించినావు. అలసట నొందినవారు నీడను కూర్చుండి నెమ్మది పాందుదురు. ఇదే మార్పు. చంద్రుని కలిగించినావు, దానివల్ల వెన్నెల. ఆ వెన్నెల వలన చల్లదనము, ఇదే మార్పు నరులకు చల్లదనము కలిగించినావు. అనగా నీళ్లు కలిగించినావు. నీళ్లు దాహము తీర్చును. దాహము తీర్చుటే, మార్పు. ఆహారము తిన్నయెడల దాహము తీరదు. నీళ్లవలనే దాహము తీరే మార్పు. నీవు చేసిన ప్రతి వస్తువు వల్ల మార్పు కనబడినపుడు నీ వల్ల మార్పు ఎందుకు కలుగదు. తప్పక కలుగజేతువు గనుక నీకు వందనములు. ఈ లోకములో నీవు సంచరించినపుడు ఒకనాడు రోగులలో ఎంత మార్పు కలిగించినావు! ఆనంద గీతము పాడుచు గంతులు వేయుచువెళ్లిరి. 1) పాపాత్మురాలు కన్నీటితో వస్తే ఆనంద భాష్పములతో పంపినావు. నీ బోధవల్ల అజ్ఞానాంధకారమును మార్చివేసి వెలుగు కలుగజేసినావు. నీవు కలిగించిన సృష్టివల్ల మార్పు, నీవల్ల మార్పు నీ శ్రమ చరిత్రవల్ల ఎంతమందిని మార్చినావో అది నిన్న నేర్చుకొన్నాము. నీ వలన మారిన మనిషివల్ల, నీ శ్రమ చరిత్రవల్ల మార్పు. గతవారము జయెత్సవ మార్పు చూపించినావు. పాపుల మార్పు, బాప్తీస్మము ఒక మార్పు, సంస్కారము అచరించుట ఒక మార్పు.ఇట్లు పాపులను మార్చుచున్నావు గనుక స్తోత్రములు. నీ శ్రమ చరిత్రలో మరొక అంశము: మార్పు పొందక పోవుట. మరొక క్రొత్త అంశమును ధ్యానించబోవు చున్నాము. కృప దయచేయుము. ఆమేన్.
1. నీకును, నీ శ్రమలకును – నిత్యమును జయము జయము.
2. నీకును, నీ ఓర్పునకును – నిత్యమును జయము జయము.
3. నీకును, నీ సిలువకును – నిత్యమును జయము జయము.

1) ప్రభువు తానే తన శ్రమలను గూర్చి ప్రవచించెను. ‘మనుష్య కుమారుడు చనిపోయి తిరిగిలేచునని’ ప్రవచించెను.
2) కయప ప్రవచనము – ప్రజల కొరకు ఒకడు చనిపోవుట ప్రయోజనము.(ఇది సర్వలోకమునకైన ప్రవచనము).
3) ప్రభువు గర్ధభాసీనుడై సీయోనుకు వచ్చునని జెకర్యా ప్రవచించెను, (జెకర్యా 9:9).
4) తోటలో ప్రార్థన
5) గేటువద్ద పట్టబడుట
6) ఐదు కోర్టులలో తీర్పు శ్రమలు
7) సిలువ మోయుట
8) సిలువ వేయబడుట
9) సమాధియగుట. ఇవి 40 దినముల ధ్యాన కాల కార్యక్రమమునకు పెద్దలు నియమించిరి. ఒక్కొక్కటి ఒకొక్క అర్ధము. (క్రమముగా ధ్యానించిన వివరములతో అర్థమగును. అట్లు చేయనందున కొంత విడిచితిని. చెప్పుటకు సమయము లేదు).
విడిచిన అంశములు
1. ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన (తోటలో)
2.పస్కా పండుగ
3. ప్రభు భోజనము
4. దేవాలయ శుద్ది
5. సద్దూకయ్యుల వాదింపు
6. రోగుల స్వస్థతకూటము (గుడిలో). ఈలాటి అంశములు అన్నియు, ఆయన శ్రమ చరిత్రలోనివే. ఇవి కూడా ధ్యానింపవలెను. పాట: ఈలాటిదా యేసుప్రేమ.
ముఖ్య కార్యక్రమము వివరింపగోరుచున్నాను. ఆయన శ్రమచరిత్రవల్ల మారిన వారున్నారు. ఆయన పూర్వజీవితము వల్ల మాత్రమేగాక, ఆయన శ్రమ చరిత్రవల్లకూడా కొందరు మారలేదు. ఎవరు మారలేదో వారిని జ్ఞాపకము చేసికొందాము,
యూదా ఇస్కరియోతు మారలేదు. 1.శిష్యులలో ఒకడైయున్నను మారలేదు. 12 మందిలో ఒకడని అతనికి బిరుదు ఉన్నది. ఆయన శిష్యులందరికి ప్రజలు ఒక పేరు, ఒక బిరుదు ఇచ్చిరి. అది బైబిలులో ఉన్నది. ‘వీరు యేసుతో ఉన్నవారు’. యేసుప్రభువుతో ఉన్న 12 మందిలో యూదా ఒకడైయున్నను మారలేదు.
2. క్రీస్తుతో ఉన్ననూ మారలేదు. వారిలో ఇతనికి ఒక ప్రత్యేక ఉద్యోగమున్నది. అది ఖజానాధికారి. అతని చేతిలో సొమ్మున్నది, అతనికి గొప్ప ఉద్యోగమున్నను మారలేదు. ఈ ఉద్యోగము ప్రభువు ఇచ్చినదే. అయినను యూదా మారలేదు.
3. పరిచారకులలో ఒకడైయుండియు మారలేదు. 12 మంది శిష్యులు, 12 గంపలతో రొట్టెలు పంచిరి. ఒక గంపతో తాను రొట్టెలు పంచెను. ఖజానాదారుడే ఉద్యోగియే. అలాగే పరిచారకుడుకూడాను. అయినను మారలేదు.
4. ఆయన శిష్యుడే, తోటలో ఉన్నవాడే, ఖజానాదారుడే, ఉద్యోగియే, పరిచారకుడే. అయినను యూదా మారలేదు. ప్రభువు ఏర్పాటు చేసిన గ్రామాదులకు బోధకులలో ఒకడుగా ఎన్నుకొనబడినవాడై, బోధకుడుగా ప్రభువుచేత పంపబడెను. బోధించి వచ్చెను. అందరితోకూడ పంపబడెను, అయినను, బోధకుడైయున
5. ప్రభువు బోధలు విన్న విద్యార్థి. బైబిలు తరగతిలో 3 1/2 సం,,లు తర్ఫీదులో, ప్రభువు ఇతరులకు బోధించిన బోధలన్నీ విన్నను మారలేదు. ఆయన శిష్యులతో ఏకాంతముగా మర్మములు చెప్పునప్పుడు, ఆ విన్నవారిలో ఒకడైయున్నను మారలేదు. గొప్ప విద్యార్థి అయినను మారలేదు.
6. ప్రభువు చేసిన అద్బుతములు కండ్లారా చూచికూడ మారలేదు. 1) రొట్టెలు, 2)మృతులను సజీవులుగా చేయుట, 3) దయ్యములు వెళ్లగొట్టుట, 4) రోగులను బాగుచేయుట, 5) గాలి తుఫాను అణచుట, మొదలగునవి చూచినా మారలేదు. ఇన్నిటికి అతడు సాక్షిగా ఉంటున్నా మారలేదు.
7. మగ్ధలేని మరియ ఆయన బోధవిని మారినది. ఆమె చరిత్ర చూచి ఆయనవల్ల ఒకరు మారడము యూదా చూచినాడు గాని తాను మారలేదు. ఇదంతయు దుఃఖము కలిగించే వార్త.

8. ప్రభువు 12 గోత్రములలోని యూదా గోత్రములో పుట్టెను. ప్రభువు యూదా గోత్రములో అనగా నా గోత్రములోనే పుట్టినాడని ఇస్కరియోతు యూదా అనును. ఆ యూదా ప్రభువు పుట్టుక వంశకర్త. ఈ యూదా ప్రభువును అప్పగించు వంశమునకు గోత్రకర్త.
9.యూదా అనగా ‘స్తుతించువాడు’ అని అర్థము, కీర్తి పొందినవాడు. కీర్తించువాడు. ఇన్ని గొప్ప అర్థములిచ్చు పేరు గలిగిన వాడైనను యూదా మారలేదు.
10. లోకములో కొందరు ప్రభువును కోరలేదు గాని డబ్బును కోరుదురు. లోకములో కొందరు ప్రభువువద్దకు చేరరు గాని డబ్బు నొద్దకు చేరుదురు. లోకములో కొందరు ప్రభువువల్ల మారరుగాని డబ్బు ఆశ అధికమగుటవలన మారిపోవుదురు.
అయితే యూదా ఇస్కరియోతు: 1) ప్రభువును కోరినవాడే 2) ప్రభువు వద్ద చేరినవాడే గాని మారలేదు. అట్లే 1. మనలో, 2. గుడిలో, 3. సంఘములో, 4. మతములో 5. క్రైస్తవులలో యూదావలె మారనివారున్నారు.యూదావలె కొందరు 1) ఎన్ని బోధలు విన్నా, 2) ఎన్ని అద్భుతములు చూచినా, ౩) ఎందరిలో మార్పు చూచినా, 4) ఎందరో మారినారని విన్నను, కండ్లతో చూచినను మారనివారుందురు. 1. ప్రభువును కోరండి,
2. ప్రభువు వద్దకు మాత్రమేకాదు, వచ్చి ఆయనలో చేరండి 3. ప్రభువునుబట్టి మారండి. ఎప్పుడో ఒకసారి మారవలెను. మీలో ఎందరు మారినారు? అని అడిగితే మారినాము అందురు. నేను మారినానా? నేను మారిపోయినానా? అని ప్రశ్నించుకోండి. మిషనులోనివారు, మతములోనివారు అనేక మంది మారరని ఇస్కరియోతు చరిత్రలో యున్నది.
||. సన్ హెడ్రిన్ సభవారు మారలేదు. ఇది యూదుల ఆలోచన సభ అనగా పంచాయితీ. ఇది 70 మంది సభ్యులతో కూడిన పంచాయితీ సభ, ఈ సభవారు, వారే ప్రభువును అన్యులకు అప్పగించి సిలువ వేయించిరి. యూదులలో కేసులుంటే ఈ సభవారు విచారణచేతురు. గనుక ప్రభువును గూర్చిన కేసు ఈ సభకు వచ్చింది గనుక వారు సిలువ వేయవలెనని తీర్మానించిరి. ఈ సభవారికి ప్రభువును గూర్చి మంచి సాక్ష్యములున్నవి. వెలుపటివారు సభలో సాక్ష్యమిచ్చిరి. అవి ఏమనగా
1) అద్భుతములు చేస్తున్నాడు, 2) మంచి బోధలు చేస్తున్నాడు. 3) ఆయన శాంత గుణముగలవాడు. ఇవి ప్రజలకు మేలుకరములైనవే.
ఈ మూడు కారణములనుబట్టి ప్రజలు ఆయన వెంట వెళ్ళుచున్నారు. ఆయన కూడ వెళ్లీపోతున్నారు. ఈ మూడు ఈ ఉపకారములు సభవారు ఎరుగుదురు గాని మారలేదు. వీరు ఒక్కరే గాదు ఈలాటి గుంపులు లోకములో ఎందరున్నారో? యూదా ఒక్కడేగాడు . యూదావంటి వారెందరోగలరో వారును మారరు. మారని వారందరు ధవళ సింహాసనము మీదనున్న జడ్జిగారైన ప్రభువు ఎదుట నిలువబడవలెను, ఆ రీతిగా నిలువబడవలసిన గుంపులనేకములుండును. అట్టివారు 1) ప్రభువును కోరరు, 2) ప్రభువువద్దకు చేరరు, ౩) అందుచేత మారరు. ఈ మూడు గుంపులవారు మారరు. ఇది బహు విచారకరమైనది. ఇది లోకచరిత్రలో ఒక విచారకరమైన చరిత్ర. వారెందుకు మారరంటే వారి హృదయముల షగల పాపము. గనుక మారలేక పోయినాడు. ఇతనిలో ధనాపేక్ష అను చెడుగున్నట్లు యోహాను అనెను. లోక ధనము కొరకు ఆశించెను.
2. సన్హెడ్రిన్ సభవారు: వీరెందుకు మారలేదు? లోక రక్షకుడైన యేసు వచ్చినప్పుడు లోక రాజ్యము ఇస్తాడని వీరు అనుకొన్నారు. యూదా లోకధనము కొరకు ఆశించినట్లు, వీరు లోకరాజ్యము కొరకు ఆశించిరి. అది వారికి ప్రభువు ఇవ్వలేదు, గనుక వారికి దొరకలేదు, గనుక వారు మారలేదు. తీర్పులో ప్రభువు, ‘నా రాజ్యము ఈ లోక సంబంధ మైనది కాదు, అది పరలోక రాజ్యము’ అని కోర్టులో చెప్పెను. అందుచేత వారు ఎన్ని అద్భుతములు చూచినను, మంచి బోధలు విన్నను, ఆయనలో ఎన్ని మంచి లక్షణములు చూచిననూ, అవి వారికి లెక్కలేదు. వారికి కావలసినది లోక రాజ్యమే. అందుచేత వారు మారలేదు.
మనలోకూడా అట్టివారున్నారు. 1) ప్రభువు అద్భుత బోధలు, ఆయన లక్షణములు తెలిసినాగాని వారు అనుకొన్నది దొరకనప్పుడు వారు మారరు. కోరినదేదో అది దొరకనప్పుడును, దొరకలేదు గనుకను, ఆలస్యమైనది గనుకను వారు మారరు. మనము కోరినవి ఆయనవల్ల చిక్కకపోయినను, మారినవారము మారినట్లు, మారే ఉండవలెను. వారు అనుకొన్నవి దొరకనందువల్ల ఆయన అద్భుతములు, బోధలు, ఆయన లక్షణములును, ఆయనయు కొట్టివేయబడును గనుక మారరు.
|||. సిలువవద్ద మారిన దొంగ, మారని దొంగయు ఉన్నారు. మారని ఇతడు రెండవ దొంగ, మనకు మూడవ మనిషి.(1. యూదా, 2. సభ, 3. దొంగ) . మొదటి దొంగ దేనినిబట్టి మారెను? ప్రభువుయెుక్క శాంతి గుణమునుబట్టి మారెను. రెండవ దొంగ ఆ శాంతి గుణము చూడలేదా? చూచెను గాని మారలేదు. రెండవ దొంగ ఆయన శాంతగుణమును బట్టియే గాక, ఆయన చేసిన ప్రార్థన వినియు మారలేదు. ఇది మొదటి ప్రార్థన, గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థనలో రెండు అడలున్నవి. 1) వీరెరుగరు, 2) వీరిని క్షమించుము. వారెరుగరా? ఎరుగుదురు. ఇవన్నియు ఎరిగియుండి వారు చేస్తున్నను, ప్రభువు ‘వీరిని వీరెరుగరు క్షమించుమని’ చేసిన ప్రార్థన వినినను అతడు మారలేదు. పౌలు తన పత్రికలో ‘(పభువుయొక్క మహిమను వారు ఎరిగియుంటే ఆయనను వారు సిలువవేయక యుందురు’ అని వ్రాసెను.
రెండవమాట: నేడు నీవు నాతో పరదైసులో ఉందువు’ ఆ ప్రార్థనయు, ఈ మాటయు అను ఈ రెండు కార్యములును దేవుడు తప్ప మరెవరును చేయలేరు, పలుకలేరు.
పాట: ‘దేవుండవు కాని యెడల… ’ మొదటి దొంగ దేనినిబట్టి మారెనో, దానిని బట్టియే రెండవ దొంగ మారవలసినది గాని మారలేదు. ఇంతకుముం దు ఇద్దరును ప్రభువును దూ షించిరి. ఆ తరువాత పైవాటిని చూచి మొదటి దొంగ మారెను. గాని రెండవ దొంగ మారలేదు. ఎందుచేత రెండవ దొంగ మారలేదు? అతని హృదయములో రెండు గలవు. ఇతరులను రక్షించిన ఆయన తనను రక్షించుకొనవలెను, ఆ తరువాత నన్నును రక్షించవలెను, అట్లు జరుగలేదు. గనుక మారలేదు. 1) ఆయన గొప్పవాడైతే సిలువమీదనుండి దిగవలెను. 2) ఇంకా గొప్పవాడైతే నన్ను కూడా దింపవలెను. ఆయన దిగలేదు, తన్ను దింపలేదు, గనుక మారలేదు. ఏదో ఒక దుర్గుణమున్నయెడల, ఎలాంటి బోధలు విన్నను మారరు. 3) బంటులు కూడా మారలేదు. ప్రభువు పునరుత్థానుడైనది వారు చూచినారు. కాని మారలేదు.

1. యూదా మారలేదు సరిగదా! మరింత చెడిపోయినాడు (స్వహత్వ చేసికొన్నాడు).
2. సన్‌హెడ్రిన్‌ సభవారు మారలేదు. మరింత చెడిపోయిరి. రక్తాపరాధము మామీద, మా పిల్లలమీద ఉండునుగాక! అన్నారు.
3. దొంగ మారలేదు. మరింత చెడిపోయినాడు. అనగా దూషించినవాడు మరింత దూషించెను.
4. కావలివారు మారలేదు. చెడిపోయిరి. మరింతగా చెడిపోయిరి. ఏలాగనగా: ఆయన బ్రతికినాడని వారు చూచిరి గనుక బ్రతికినాడని చెప్పవలసినది గాని ఆలాగు చెప్పలేదు సరిగదా! శిష్యులు శవమును ఎత్తుకొని పోయిరి అనిరి. అనేకమంది అట్లే మారరు గాని మరింత చెడిపోవుదురు.
షరా: మారకపోతే సరిగాని మరింత చెడవద్దు. ఇట్టివారు సంఘములో ఉన్నారు, చాలా విచారము. ఈ రెండు కథలు మీరు పుచ్చుకొనండి. ఇంటికి వెళ్లండి, పండుకొనండి, ఆలోచించుకొనండి. నేను మారినానా? అని ప్రశ్నించి పరిశీలన చేసికొనండి. మారకపోతే సరేగాని మరింత చెడిపోకండి.

ఈలాగు మన హృదయములను నిత్యము ప్రశ్నించుకొని, మారిన అంతస్థు స్థిరపడి రాకడకు సిద్ధపడు కృప పెండ్లికుమారుడు నేటి శ్రమకాల ధ్యానమునుబట్టి మనకు దయచేయునుగాక. ఆమేన్.

ప్రార్థన:- ఈ మాటలు విని, ప్రయత్నించువారిని దీవించి మార్చుము. మాలో మారుటకు ప్రతివారిని ప్రతి విషయములోను మార్చుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.

కీర్తన: 1. మహాత్ముడైన నా ప్రభు
‌ విచిత్ర సిల్వ జూడ నా
‌ యాస్థిన్‌ నష్టంబుగా నెంచి
గర్వం బణగ ద్రొక్కుదున్.

2. నీ సిల్వ గాక యో దేవా
దేనిన్ బ్రేమింప నీయకు
నన్నాహరించు సర్వమున్
నీ సిల్వకై త్యజింతును “.ఆమేన్.

Share this now. Choose your platform