సిలువ ధ్యాన దీవెనలు

లూకా 9:51-55; 1తిమోతి. 1:13.

ప్రార్థన :- యేసూ ప్రభునా! నీ శ్రమల ధ్యానము ద్వారా అనేకమైన  ఆశీర్వాదములను మా కొరకు దాచి ఉంచినావు. గనుక నీకు స్త్రోత్రములు.  నీ శ్రమలను సంపూర్ణముగా ధ్యానించి, సంపూర్ణమైన ఆశీర్వాదము పొందునట్లుగా మమ్మును నడిపించుము. ఆమేన్.

క్రీస్తుయెుక్క శ్రమకాలము మన ఆనందకాలము. ఎందుకంటే ఆయన శ్రమలవల్ల మన శ్రమలు గతించిపోయినవి. అయినప్పటికిని ఇప్పుడు మనకు వేదన, దుఃఖము, బాధ రాకపోదు, రాక మానదు. కష్ట కాలమందు తప్పక దుఃఖము వచ్చును. అలాగే రావలసిన ఆశీర్వాదము రానప్పుడును దుఃఖము వచ్చును.

1) ఇస్సాకు కుమారుడైన ఏశావు చాలా ఏడ్చినాడు. ఎందుచేత? రావలసిన దీవెన రాలేదు. వచ్చునని నిరీక్షించిన దీవెన పోయినది. అది ఒక విధమైన దుఃఖము. అయితే ఆ ఆశీర్వాదము తనది కాదు తన తమ్మునిది. మనము ప్రార్ధన చేసినప్పుడు రావలసిన దీవెన రాకపోతే దుఃఖము కలుగును. కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవరియొక్క కోరిక నెరవేరలేదో వారు దుఃఖించుట న్యాయమే అయినప్పటికిని దుఃఖించకూడదు. అది తనకు రావలసినదికాదు. తన తమ్మునికి రావలసిన దీవెనయే. ప్రభువుయెుక్క సిలువ ధ్యానము వల్ల మనకు ఒక దీవెన రావలెను. క్రిస్మసు రోజున ఒక దీవెన. పునరుత్థానమప్పుడు ఒక దీవెన. ఆరోహణమప్పుడు ఒక దీవెన. ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి పండుగ రోజున ఏదో ఒక క్రొత్త దీవెన ఉండును. మనము అందుకొంటేనే. అందుకొనకపోతే ఆ దీవెనరాదు, గనుక అందుకొననప్పుడు మనకు మనోవిచారము.

2) బైబిలులో మరియెుకచోట మరొక కథ గలదు. అదేమంటే హాగరు కథ . ఈమె ఇష్మాయేలుయెుక్క తల్లి. అరణ్యములో కొడుకునకు నీళ్లు దొరకనందున దూరముగాపోయి ఘోల్లున ఏడ్చుచున్నది, అప్పుడు దేవదూత వచ్చి నీళ్లున్న చోటు చూపించినది. అయితే దేవదూత – నిన్ను చూచి, నీ ఏడ్పు విని, రాలేదు గాని నేను ఆ చిన్నవాని మొర్ర విన్నాను, చూచినాను’ అన్నారు. అపుడు హాగరుకు ఆదరణ కలిగింది. ఏశావుయెుక్క ఏడ్పు వల్ల ఆశీర్వాదములు కోరిననూ ఆశీర్వాదములు దొరకలేదు గాని కొన్నాళ్లకు నీ సహోదరుని కాడిని నీ మెడ మీద నుండి తొలగించుకొంటావు అనే దీవెన కలిగినది. అది రాజుల కాలములో జరిగింది. ఏడ్చినందుకు కొంచెము దీవెనైన తనకు దొరకలేదు. తన సంతానమునకు దొరికింది. తనకుకాక తన సంతానమునకు దీవెన అందినది. అట్లే మనకుకూడా జరుగును. అసలు దీవెన మనకు రాకపోయినా, మన తరువాతి వారికైనా వస్తుంది. నోవహు కుమారులలో హాము శపింపబడవలసింది. అయితే అక్కడ ఆలాగు లేదుగాని కనాను శపించబడెను. హాము యెుక్క సంతానమునకు కూడా శాపము అప్పుడు రాకపోయినను, ఆ సంతానములో ఎవరికో ఒకరికి తరువాత రాకమానదు. గనుక మీలో ఎవరైనా ఒక చెడు కార్యము చేస్తే దాని ఫలితము మీకు రాకపోయినను, మీ తరువాత వచ్చే వారికైనా వచ్చితీరును. అట్లే దీవెన కూడా వెంటనే రాకపోయినను మీ తరువాత వచ్చే వారికైనా లభించును. ఆలాగే మీరు సిలువ ధ్యానము చేస్తే, దీవెన మీకు రాకపోయినను మీ తరువాతి వారికైన వచ్చి తీరును.

3) హిజ్కియాకు మరణము దగ్గరబడినది అని వినబడినప్పుడు అతడు వెంటనే గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చెను, ఆ తరువాత దీవెన వచ్చింది. ఆ దీవెన ఏమనగా తన ఆయుష్కాలమంతయు పొడిగించబడింది. ఆ దీవెన తన కాలములోనే వచ్చింది. ఆలాగే మీరు సిలువ ధ్యానము చేస్తే వెంటనే దీవెన రావచ్చును అని తెలిసికొనవలెను. ఈ ప్రకారముగా ఇది బైబిలు చరిత్రలో ఉన్నది. లోక చరిత్రలోకూడా అదే ఉన్నది. ఉదా: ఒక మనిషి పాపము చేసినప్పుడు విలపిస్తాడు . ఆ తరువాత క్షమాపణ పొందును. ఆ తరువాత అతనికి ఆశీర్వాదము వెంటనే వస్తుంది. బైబిలులో ఇంకొక కథ గలదు.

4) ఒక స్త్రీ ప్రభువు కాళ్ళు కడిగి ఏడ్చింది. ప్రభువు వెంటనే పాప క్షమాపణ చెప్పినాడు. అది ఆమెకు దీవెన, అలాగే సిలువ ధ్యానము చేసేటప్పుడు దేవా! నా పాపము నిమిత్తమై నీవు శ్రమపడ్డావు అని దుఃఖించిన యెడల అప్పుడు ఆశీర్వాదము,ఆదరణ కలుగక మానదు. ఒక పాపి తన పాపము నిమిత్తమై దుఃఖి స్తే తప్పకుండా ఆ దుఃఖము ప్రభువు అంగీకరించును. అది ముఖ్యము, అపుడు అతనికి క్షమాపణ కలుగును. గాని కొంతమందికి క్షమాపణ వచ్చినట్లు తెలియదు. అది వారు కనిపెట్టనందు వల్ల తెలియదు. ఏ ప్రార్థనకైనా ప్రభువు జవాబు ఇవ్వకపోవచ్చును గాని పశ్చాత్తాప ప్రార్ధనకు జవాబు ఇవ్వని యెడల పాపి నిరాశలోపడి, దేవుని దూషించి మరింత గొప్ప పాపము చేసి నశించును, అందుచేత వెంటనే జవాబు ఇస్తాడు. అటువంటి పాప క్షమాపణ వాక్యములు బైబిలులో చదువుకొంటే ప్రభువు ఆదరణ కలిగిస్తాడు.

మరొక సంగతి : మనిషి పాపము చేసిన తరువాత పాప ఫలితముగా శిక్ష వచ్చును. మనిషి ఆ శిక్షను చూచి ఏడ్చునేగాని పాపమును గూర్చి ఏడ్వడు. అట్టివారు కొందరున్నారు గనుక ఆలాగు శిక్షనుచూచి ఏడ్వరాదు. ఉదా: యేసుప్రభువు సిలువ మ్రానుమీద మనకు బదులుగా శిక్ష అనుభవించెను గాని ఆయన ఏడ్వలేదు. ఆయన ఆ శిక్ష అనుభవించుచున్నప్పుడు నేను లోకము నిమిత్తమై శిక్ష అనుభవించుచున్నాను’ అని ఆనందించును. అట్లే మనము పాపముచేసినందువల్ల శిక్ష వచ్చినప్పుడు శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించవలెను. సిలువ ధ్యానము వలన అదే మనము నేర్చుకొనవలెను.

సిలువ ధ్యానకాలమందు కొందరు స్త్రీలు ఆయన బాధలు చూచి ఏడ్చినారు. ప్రభువు అది ఒప్పుకొనలేదు. ఎందుకంటే వారియెుక్కయు, వారి పిల్లల యొక్కయు పాపములను గురించి వారు ఏడ్వలేదు. వారి పాపములు, వారి పిల్లల పాపములు ఎవరు సిలువ మీద మోయుచున్నారో ఆయనను గురించి ఏడ్చిరి. అందువల్ల వారు ఏడ్చిన ఏడ్పు నిష్పలము, వారు వెంబడించుట నిష్పలము. ఎందుకంటే వారి పాపఫలితము ఆయన మీద పడినది. అందువల్ల వారు సంతోషించవలెను గాని సంతోషించలేదు, అందుచేత వారు ఏడ్చుటతో, వారి పాపములు ఆయన మోయుట నిష్ఫలమైనది.

ప్రభువు — నేనింత ఇష్టపడి వారి పాపములు మోస్తుంటే, భరిస్తుంటే మీరానందించవలెనా? దుఃఖించవలెనా? అని తలంచినట్లున్నది.

ఉదా: ఒకడు అడవిలోనుండి కట్టె మోపులు నెత్తిమీద మోసికొని వస్తుండగా మెడ లాగుట, నెత్తి లాగుట కలిగినది. అప్పుడు ఇంటివద్ద నుండి వచ్చిన ఒకరు, ఆ మోపు తన మీద వేసికొంటే అతడు ఏడ్చునా? సంతోషించునా? వందనము అంటాడు. అట్లే సిలువ మీద మన ప్రభువు మన పాపములు, వ్యాధులు, శిక్షలు తనమీద వేసికొని భరిస్తే, భరిస్తుంటే కృతజ్ఞతతో వందనములు చెప్పవలెనా? లేక ఏడ్వవలెనా? కృతజ్ఞతతో వందనములు చెప్పవలెను.

మనము ఈ 40 దినములు రెండు పనులు చేయవలెను.

1) మన పాపముల నిమిత్తము దుఃఖపడవలెను.

2) మరొక దరినుండి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను, ఈ రెండు పనులు మంచి శుక్రవారము వరకు జరిగించవలెను, సిలువ ధ్యానములో సిలువ ఉండకూడదు గాని సిలువవలన వచ్చిన జయము ఉండవలెను, అది తలంచాలి.

అట్టి జయ దీవెనలతో ప్రభువు మిమ్మును అలంకరించును గాక. ఆమేన్.

 కీర్తన:

  “పాప భారమెల్ల మోసి – బరువు దించి వేసినావు 

                                             ” రక్షకా”

   వ్యాధి భారమెల్ల మోసి – వ్యాధి దించి వేసినావు              

                                             ” రక్షకా”

   శిక్ష భారమెల్ల మోసి – శిక్ష దించి వేసినావు” 

                                             ” రక్షకా” 

Share this now. Choose your platform