సిలువలోని  ప్రతినిధి

యోహాను 18:14.

ప్రార్థన:- ప్రభువా! నీ సహింపు గ్రహించుకొన్నయెడల ఎండిన మొక్కవలె వాడిపోదుము, తెలిసిన యెడల సహింపలేము, అది సువార్తికులకు తెలియదు, దూతలకు తెలియదు, మాకు అసలు తెలియదు. నీవు  శ్రమపడినావన్నది సత్యము గాని దాని వివరమును మేము సహింపలేము ఇదంతా మరుగుచేసి మమ్మును కరుణించుము.

యేసుప్రభువా! నీవు సహింపు ద్వారా జయము పొందినట్లు మాకుకూడా సహింపు ద్వారా జయము కలుగు నిమిత్తము, మాకు సహింపు శక్తి దయచేయుము, మేము జయించి జయము పొందక ముందు, సహించి జయము పొందే తరుణము దయచేయుము, మేము పాటములో ఏర్పర్చుకొన్న ప్రకారము నీవు 8 పర్యాయములు, 8 విషయములలో సహింపు కనపర్చినట్లు, మేముకూడ అన్నిటిలో సహింపు కనపర్చే ధారుడ్యము అనుగ్రహించుము. ఒక విషయములో సహింపు కలిగియుండుట వల్ల మాకు ప్రయోజనములేదు. కాబట్టి అన్నిటిలో, అన్నికాలములలో, అన్ని విధములైన అవస్థలలో సహింపు, ఓపిక, ఓర్పు అనుగ్రహించుము. మేము సహించేటప్పుడు నీ సహింపు మాకు జ్ఞాపకము చేసి, నీ సహింపులో నుండి సహింపు అందుకొనే విశ్వాసము దయచేయుము. సహించే రక్షకా! మేము సహించే వధువులమై యుండే కృప దయచేయుము, ఎన్నో పర్యాయములు మా అనుభవ ప్రకారము మా సహింపునకు కదలిక, తగ్గింపు, అంతరింపుకలుగుట చూచుచున్నాము. గనుక మా సహింపును దిట్ట పర్చుమని వేడుకొనుచున్నాము.

నీవు త్వరగా వచ్చెదవని వాగ్దానము చేసినావు. మా దృష్టికి ‘నీవు ఆలస్యము చేయుచున్నావు’ అని తోచుచున్నపుడు, స్వాభావికముగా సహింపు కదలి పోవును. గనుక అట్టి కదలని సహింపువలన

పెండ్లికుమార్తె వరుసకు మమ్మును భద్రపర్చుము. ఒక్కొక్క సహింపు తరుణములో నా అనుభవమునకు కొంత అనుభవమును, నా సిద్ధపడుటకు కొంత సిద్ధపడుటయును, నాకు అనుగ్రహింపుము. మహిమకు కొంత మహిమయును చేర్చబడును గనుక ఈ చేర్చబడుటకు నేను దూరము కాకుండే ధైర్యము దయచేయుము. నీకు వచ్చిన శోధనలవంటి శోధనలు నాకురావు అని నేననుకొనకుండునట్లు నాకు జాగ్రత్త గల జ్ఞానోపాయము లభింప జేయము. శ్రమలో పాల్గొనుటవల్లనే మహిమలో కూడ పాల్గొందుమని పెద్దలు చెప్పుచున్న వాక్యమును జ్ఞప్తియందుంచుకొనగల జ్ఞాపకశక్తి లభింపజేయుము. ఓ ప్రభువా! నీ శ్రమ ఎంత గొప్పదో ప్రవక్తలకుగాని, సువార్తికులకు గాని, దూతలకుగాని తెలియదని తలంచు చున్నాము. ఒకవేళ మాకు తెలిస్తే మేము ఉండము. నీ మహిమ మాకు మెరుగు, అనగా చాలును, సరిపోవును గనుక అట్టి స్థితిలో మమ్మును స్థిరపర్చుము. ఆమేన్.

       శుక్రవారము మహా సంతోషకరమైన దినము. ఆదివారముకూడా మహా సంతోషకరమైన దినమే. కొందరు శుక్రవారమున దుఃఖింతురు. అయితే ఆ దినమే విముక్తి దినము. శుక్రవారము సిలువమీద జయము. ఆదివారము పునరుత్థాన జయము. సిలువమీద క్రీస్తు ప్రభువుకు కలిగిన జయము. ఆదివారమున పునరుత్థానమునుబట్టి జయము. ఈ రెండును రెండు విధములుగా కలిగినవి.

          నా దగ్గరున్న పదిహేను బూరలతో నేను మాట్లాడుచున్నాను. ఈ బూరలు శుక్ర, ఆదివారములు వినబడును. చాకలి వాని బట్టల శబ్దము మనకు వెంటనే వినబడును. అయితే అది కొంచెము సేపుండును. అలాగే గొడ్లచావిడిలోని శబ్ధమును ఉండును. ఈ సమయములో ఆ శబ్ధములవైపు కాక, అందరు సిలువవైపు చూడవలెను. అటువంటి మనో నిదానముండవలెను, చివరి వరకు అది ఉండవలెను. రెండు మనో నిదానములు. 1) సిలువ, 2) సంఘములను తలంచుకొనవలెను. యేసుక్రీస్తుయెుక్క శ్రమచరిత్రలో జయము. యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన చరిత్రలో జయము. ఇవి సంఘము పొందవలసిన జయములు. వీటిని ప్రభువు పొంది చూపించెను. సంఘము శ్రమలో జయము పొందవలెను. అలాగే సంఘము తన పునరుత్థానములో జయము పొందవలెను.

         యేసుక్రీస్తు ప్రభువు శ్రమలో ఎన్ని రకముల జయములున్నవి? హెబ్రీ 12:2 సిలువను గురించి:

         1) యేసుక్రీస్తు మన ప్రతినిధియై జయము పొందెను (యెషయా 9:6).

         2) ఆయన కాడి సుళువు …… గనుక ఆయనయెుద్ద నేర్చుకొనవలెను (మత్తయి. 11:29).

         3) ఆయన మన జీవము నిమిత్తమై మన పాపములను మ్రానుమీద మోసి జయము పొందెను ( 1పేతురు 2:24).

         4) ఆయన మన ప్రతినిధియై మన కొరకు విజ్ఞాపన చేయుచూ, జయమిచ్చు చున్నారు (యోహాను 17:9).

    ఆయన జన్మములో, బోధలో, శ్రమలో, విజ్ఞాపనలో, పునరుత్థానములో మన ప్రతినిధియై ఉన్నారు. ఆయన మన కొరకు శిశువై పుట్టెను, మనకొరకు బోధించెను, మన కొరకు విజ్ఞాపన చేసెను. ఆయన మన కొరకు సిలువ మ్రాను మీద శ్రమ అనుభవించెను. ఆయన మనకొరకు మరణమును జయించి తిరిగిలేచెను. మన కొరకు మనము బోధించుకొనలేము, ఆయనే బోధించవలెను. మన కొరకు మనము ప్రార్థించుకొనలేము. మన కొరకు శ్రమపడలేము, గనుక ఆయనే ప్రార్థించవలెను. శ్రమపడవలెను.

మన జన్మము అసంపూర్తియైనందున, మన జన్మము వర్ధిల్లుటకు ఆయనే జన్మించెను, మన బోధ చాలదు. ప్రార్ధన చాలదు, శ్రమ చాలదు. మనము గాని శ్రమపడితే చచ్చి ఊరుకొందుము. ఇక తిరిగి లేవలేము. మనము కీడు కొరకు ప్రార్థింతుము, అజ్ఞాన బోధ చేస్తాము గనుక ఆయన మన కొరకు పూటపడెను. ప్రార్థన, శ్రమ, జన్మ ప్రతినిధిగా మన కొరకు ఆయెను. ఈయన శ్రమలో మనకొరకు ప్రతినిధియై యున్నాడు.

 1) మానవ ప్రతినిధి : మనకొరకు ఒకరు జన్మింపలేరు, మనమును వేరొకరి కొరకు జన్మింపలేము. అయితే ఆయన మనకొరకు జన్మించెను. మనము సంగతులు పూర్తిగా బోధపర్చుకొనలేము, బోధించుకొనలేము. గనుక మనకొరకు ఆయన బోధించెను. మనము మన కొరకు సరిగా ప్రా ర్థించుకొనలేము గనుక ఆయన ప్రార్థించెను. మనము మనకొరకు శ్రమ అనుభవించలేము. గనుక ఆయనే మనకొరకు శ్రమ అనుభవించెను. ఆయన జీవితమంతా మన కొరకే. ఆయనజేసినవి అన్నీ మనకొరకే జేసెను గనుక కృతజ్ఞతతో ఈ పండుగ చేయవలెను . నా కొరకే నీవు శ్రమపడినావు గనుక వందనములు అని పైనున్నవన్నియు, సంఘములతో చెప్పించవలెను. సంఘముచేత ఈ రీతిగా స్తుతి ప్రార్థన చేయించవలెను.

2) శ్రమలో ప్రతినిధి : శ్రమలో ఆయన మనకొరకు ఏలాగు జయము పొందెను. ఆయన శ్రమలు పొందుట జయము పొందుటకే. శ్రమలు మనము పొందగలము గాని జయము పొందలేము. మనము విసుగుకొందుము. యేసుక్రీస్తు ఏలాగు (శమపొందెనో ) శ్రమ చరిత్రలో నుండి లాగుకొనవలెను. 1) గెత్సేమనే తోటలోనికి మనస్సు పోవలెను. గదిలో ప్రార్థన చేయండని ఆయన (మత్తయి 6:6) లో మనకు నేర్పెను గాని యేసుక్రీస్తు  తోటలోనికి పోయెను. ఒకడు ఊళ్లో, ఎనమండుగురు తోట గేటు దగ్గర, తోటలో ముగ్గురు  (కునికి నిద్రపోవుచుండిరి). యేసుక్రీస్తు ఒక్కరు తోటలో చెమట రక్తబిందువులవలె కారునంతగా ప్రార్థించుచుండెను. ఆయన అంత శ్రమలో ఉన్నారు. ఈ శ్రమ తప్పించు తండ్రీ! అని ప్రార్థించెను. అది శ్రమలకే గుర్తుగాని సంతోషమునకు గాదు గనుక రక్త బిందువుల వల్ల, వేదన ప్రార్థనవల్ల శ్రమ కనబడు చున్నది. తొలగించుమని ప్రార్థించుచున్నాడు గాని తండ్రీ! నీ చిత్తమన్నాడు. విసుగుకుంటే ఆ గిన్నె తీసివేయవలెను  అని ప్రార్థించును. గనుక సంఘము ఆయన వేదనలోని ఓర్పును గ్రహించవలెను.

ఆయన శ్రమలో సహింపువల్ల జయము పొందెను. గెత్సేమనే తోటలోకారిన స్వేద రక్త బిందువులను బట్టియు, తొలగింపుము అనే మాటనుబట్టియు ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము. గాని ‘నీ చిత్తము’ అని చెప్పడమువల్ల ఆయన ఎంతగా సహించుకొన్నా డో తెలియుచున్నది. కాబట్టి సహింపువల్ల ఆయన జయము పొందెను. రాబోయే శ్రమల గిన్నెను సహించెను.

3) బంధింపబడుటలో ప్రతినిధి:- తోటలో ప్రార్థన చేసిన తరువాత శిష్యులదగ్గరకు వచ్చి, వారినిలేపి గేటు దగ్గరకు వెళ్లగా రౌడీలు ఆయనను అరెస్టు చేసిరి. ఆయన తండ్రిని ప్రార్థించినట్లైతే సైన్యమును పంపును. అరెస్టును సహించుటవల్ల, ఆయన గెత్సేమనే తోట వెలుపల శ్రమలు పొందెను. అరెస్టు చేసినప్పుడు తప్పించుకొనుటకు శక్తిలేని వానివలె పట్టుబడి సహించెను. అట్లు జయము పొందెను.

4) సిలువ మోసిన ప్రతినిధి:- ‘నేను మోసికొని పోలేను’ అని ఆయన అనలేదు. ‘ సీమోనును బ్రతిమిలాడలేదు. బ్రతిమాలలేదు. ఆయన మోస్తూనేయున్నాడు. కడవరకు సిలువ మోసి సహించెను. సిలువకర్ర మోసి విసుగకుండ సహించుటవల్ల జయము పొందెను. (తూలినను సహించెను) ఇది సహింపు ద్వారా పొందిన జయము.

5) తీర్పులు సహించిన ప్రతినిధి:- ఆయన తీర్పులు సహించుటవల్ల జయము పొందెను. (కయప తీర్పు, సన్ హెడ్రిన్ తీర్పు, పిలాతు తీర్పు, హేరోదు తీర్పు, పిలాతు తీర్పు (రెండవసారి) మొదలగునవి) ఈ తీర్పులు సహించుటవల్ల జయము పొందెను.

     ఉదా: జడ్జిగారికి తీర్పు విధించి, దోషిగా నిలువబెట్టి, దొంగను జడ్జిగా చేసిన ఎంత కష్టము! యేసుక్రీస్తు రేపు పిలాతుకు తీర్పుతీర్చవలెను. కయప ప్రధాన యాజకుడు. అయితే, యేసుక్రీస్తు ఆ ప్రధానయాజకునిచే అబద్ధ సాక్ష్యము పొందెను. అందరికీ తీర్పు తీర్చగల నమ్మకమైన సత్యసాక్షి యేసుక్రీస్తే. అయితే ఇపుడు ఈయనకే తీర్పు. పంచాయితీలో తీర్పు యజమాని చేయవలెను. అనగా సన్హెడ్రిను వారికే ఆయన తీర్పు తీర్చవలెను. అయితే ఆ నీతిపరునికి నీతిలేనివారు మరణశిక్ష విధించిరి.

    ఆయనలో ఏ నేరములేదని పిలాతు గ్రహించినా, చివరి వరకు ఆ మాట మీద లేడు. కోర్టు నుంచి బోధ వినిన పిలాతు భార్య ఆయన పక్షమాయెను. వేయ్యేండ్లలో సర్వలోకమునకు ప్రభువు తీర్పుతీర్చనైయున్ననూ, ఆయన ఇప్పుడు తీర్పు పొందుచుండెను. ‘నేను కలుగజేసిన మానవునివల్ల, అన్యునివల్ల, నేరస్థునివల్ల, స్వజనులవల్ల, తీర్పుపొందనైయున్నాను.’ ఇది ఆయనకు కల్గిన గొప్ప అవమానము. హేరోదు కోర్టులో యేసుక్రీస్తుకు నిలువబడుట ఇష్టముండదా! చిన్నప్పుడు పారిపోయెను గాని ఇప్పుడు కోర్టులోకి పోయెను. ఈ అవమానమంతయు ఆయన మన కొరకు పొందెను. స్వజనులవల్ల తీర్పు, అన్యులవల్ల తీర్పు ఎవరికొరకు ఆయనకు వచ్చెను? వారందరి కొరకు ఆయన తీర్పు పొందెను. ఆ తీర్పు సహించుటవల్ల ఆయన జయము పొందెను. మన ప్రధానయాజకుడైన యేసు, ఇహలోకపు ప్రధానయాజకుడైన కయపవల్ల తీర్పు పొందెను. సంఘ నాయకుడైన యేసు యూదుల సంఘమువల్ల తీర్పు పొందెను (మరణశిక్ష). వేయ్యేండ్ల శాంతిపాలన చేయనైయున్న రాజైన యేసు, రోమా ప్రభుత్వములోని అధికారులగు పిలాతువల్లను, హేరోదువల్లను తీర్పు పొందెను.

6) శరీర బాధ సహించిన ప్రతినిధి:- (చేతులలోని పోట్లు, కాళ్ళపై పోటు, ప్రక్కలో పోటు, తలపై వేసిన జల్లెడపోటు) ఇవి ఆయన సహించెను. విసుగుకొనలేదు. ఈ సహింపువల్ల ఆయన జయము పొందెను. దాహము అణచుకొనుట వలన బాధ. ఈలాగు దాహ బాధను అణచుకొనుట వలనను ఆయన జయించెను.

7) అపహాస్యము పొందిన ప్రతినిధి:- ఇతరులను రక్షించినవాడా! రక్షించుకో! దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో లేపువాడా, ….. దిగి రమ్ము! ఈ హేళన సహించుటవలన జయము, గుద్దుటవల్ల, రెల్లుపుడకవల్ల, రక్షించుకో అని అనుటవల్ల. వీటివల్ల ఆయనను హేళన చేస్తే ఇది ఆయన సహించెను, జయము పొందెను.

8) మరణమును జయించిన ప్రతినిధి:- ఆయన మరణమును, సమాధిని జయంచెను. నేను మరణించను సమాధికి వెళ్ళను అని అనేవారెవరులేరు. మరణము లేనివాడు మరణమును సహించుకొన్నాడు. కనుక జయము. సమాధి అవసరము లేనివాడు సమాధికి వెళ్లి సహించి జయించెను.

 షరా :-‘తొలగింపుము’ అనే మాటలోను, ‘ఏల చేయి విడిచినావు’ అనే మాటలోను, స్వేద రక్త బిందువులలోను ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము! సిలువమీద తాను మనిషై ‘దేవా’ అని ప్రార్థించెను. కుమారుడైతే తండ్రీ! అని ప్రార్థించును. ఒక మనిషి వలె గొప్ప బాధలో చేయి ఎందుకు విడిచితివనెను. ఆయన మన ప్రతినిధియైనందున ఇన్ని విధములైన శ్రమలను, అవమానములను సహించుకొని భరించెను.

అటి ధన్యత ఇక్కడ చేరిన వారికిని, ప్రతినిధియైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక.ఆమెన్.

 

కీర్తన : “పంచ గాయములు నే – నెంచి తలంచి నా  – వంచన ఇది సోదరా! నన్ను – వంచించు సైతాను – వల నుండి గావ తా – నెంచి బొందెను సోదరా”

Share this now. Choose your platform