సిలువలోని నీతిసూర్యుడు – సంఘ పుష్పము

తండ్రి: ఆది – 18:28;  కుమార: మత్తయి 24:32; పరిశుద్ధాత్మ : రోమా 8:1

    ప్రార్ధన: యేసుస్రభువా! నీవు చేసిన ఉచిత అంశమును ధ్యానించు నట్లు సహాయము చేయుము. నీ శ్రమ చరిత్ర ఆరంభ దినములో ఉన్నాము. ఇంత వరకు నీ సేవా చరిత్ర విన్నాము. ఇప్పుడు నీ శ్రమచరిత్ర ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేయుమని అడుగుచున్నాము. ఆమెన్.

ప్రభువు చరిత్రలో వాగ్ధానములు, ప్రసంగములు, చరిత్రకూడ ఉన్నది. ఆయన యూదాజన మతాచారముల ప్రకారము నడుచుట ఉన్నది,

 1) వాగ్ధానము,

 2) ప్రసంగము,

 3) చరిత్ర,

 4) ఆచారములు.

       ప్రభువు సంఘానికి పైవాటిని, స్వతంత్రతను బట్టి వాడుకొనుటకు ఇచ్చెను. పై నాల్గింటిని మాత్రమేకాక, స్వతంత్రతనుబట్టి కూడ సత్యమును ఆచరింపజేసెను. ‘సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును’ అనెను. అనగా సంగతి తెలిసికున్న తరువాత స్వతంత్రముగా ఆ సత్యములో నడుచుకొనవచ్చునని అర్ధము.

         ఏదేనులో చెట్లువేసి తినండి, తినవద్దని చెప్పుట దేవునిపనియై యున్నది, అట్లు చేయుట నరుని స్వతంత్రత. తినుటలో నరుని ఇష్టమును, స్వతంత్రతనుబట్టి ఎన్నైనను తినవచ్చును గనుక స్వతంత్రత ఆదిలోనే ఉన్నది. స్వతంత్రతనుబట్టి పై నాల్గింటిని సంఘమేర్పర్చుకొనెను, ఎందుకిట్లు ఏర్పర్చుకొన్నారని ప్రభువు అనరు గాని వాటినిబట్టి సంతోషించుట సంఘము యెుక్క పని. ఆచార ప్రకారము ఆత్మీయ క్రమమును ఏర్పర్చుకొని చేసికొనినప్పుడు, దేవుడు ఆటంకము చేయడు. పై నాల్గును దేవుడిచ్చినవి అని చేయునప్పుడు, అవి బైబిలుకు వ్యతిరేకముగా ఉండకూడదు. భూలోక సంఘములో నీతి సూర్యుడు ప్రకాశించు చున్నాడు, ఆకాశములోని సూర్యునిబట్టె కాలములు అనేవి జరుగుచున్నట్లు, క్రీస్తును బట్టి సంఘములో ఆచారములు, పండుగల కార్యక్రమములు జరుగుచున్నవి. పొద్దు తిరుగుడు పువ్వు మూడు పూటలు సూర్యుని అనుసరించి తిరుగుచున్నది. భూలోక సూర్యునిబట్టి, ఆ పువ్వు సూర్యుడు ప్రకాశించు వైపునకే చూచినట్లు, సంఘము తన ముఖమును నీతి సూర్యుని తట్టే ఉంచి చూచును. క్రిస్మసు రోజున నీతి సూర్యుడు తొట్టెలో ఉన్నాడు. గాన సంఘము తొట్టివైపు చూచి, క్రిస్మస్ సూర్యుని ధ్యానించుచున్నది. లోకము, సంఘముకూడ తొట్టి వైపే చూచెను. పునరుథ్థాన రోజు, అనగా ఆదివారమున ఆయన పొందిన జయమువైపు చూచెను. జ్ఞానులు, ఇంటిలో ఉన్న ప్రభువు తట్టును; సుమెయోను ఎనిమిదవ రోజు గుడిలో ఉన్న పరిశుద్ధ శిశువు తట్టును చూచెను. గనుక భూలోకములో సంఘమనేది ప్రొద్దు తిరుగుడు పువ్వు వంటిదే. ఆయన కనబడు తట్టే చూడాలి. ఆయన శ్రమ చరిత్ర చాలా ఉన్నది గనుక ఈ ప్రారంభదినమున మొదటి దిన చరిత్ర, తట్టు చూడాలి. యేసుప్రభువు సర్కీటులో ఉన్నప్పుడు ‘ఇదిగో యెరూషలేము వెళ్లుచున్నాము’ అని శిష్యులతో చెప్పెను. శ్రమ ఆయన కన్నులకు కనబడుచున్నది. శ్రమల ఆరంభ దినమిదే. సంఘము తన ఇష్ట ప్రకారము భస్మ బుధవారము ఏర్పర్చెను, ఇక ఈ నలుబది దినములు యేసుప్రభువు సిలువవైపు తిరిగి మంచి శుక్రవారం చరిత్ర ధ్యానించనై యున్నాము. దానికి చాలా చరిత్ర ముందున్నది గనుక వివరముగా ధ్యానించుదము. ‘ప్రభువా! నా నిమిత్తమై ఈ శ్రమలు పొందుటకు నీవు బాధ పడినావు. కాబట్టి నీకు వందనములు’ అని చెప్పుటకు ఈ దినము ధ్యానించాలి. ఆయన శ్రమలను జ్ఞాపకము చేసికోవాలి. ఇది తప్పుగాదు. మనమేమంచి పనిచేసినా అది ప్రభువుకు ఇష్టమే. అబ్రాహాము దేవునితో మాట్లాడినప్పుడు 1) నేను ధూళిని, 2) బూడిదను అని మాట్లాడెను. తన స్థితి తలంచినందున ఆలాగు మాట్లాడెను. గనుక దీనికి బూడిద బుధవారమని పేరు పెట్టిరి. ‘అయ్యో!’ ప్రభువా! నీవు నా నిమిత్తము శ్రమపడి, సిలువపొంది చనిపోవుటకు నేను తగను’ అని చెప్పుకొని స్తుతించాలి. మన పాపపు జాబితా ఎత్తికొనికాదు గాని దాని వలన కలిగిన అయోగ్యత ఒప్పుకొనవలెను. ‘నా నిమిత్తము శ్రమలు పొందినావు. నేను తగను. అందుకని నేను అయోగ్యుడను’. నీ శ్రమ నీవే పొందు అని నన్ను అనక ఆయన తానే పొందెను.

           ఒక కుండకు రంధ్రము చేసి భూమిలో చింత గింజవేసి మొలచిన మొక్కపై కుండ బోర్లించి, రెండు మూడు రోజులైన తరువాత ఉదయమునే కుండతీసి చూస్తే మొక్క తూర్పుకు తిరిగి ఉండును. కుండలో సూర్యుడు లేడు గాని రంధ్రములో నుండి సూర్యుడు కనిపించుచున్నాడు. సాయంత్రమున చూస్తే పడమటి తట్టు ఉండును.ఆలాగు తిరుగుట మొక్క నైజము. అలాగే తన ముఖము ప్రభువు తట్టు త్రిప్పుట సంఘము యెుక్క నైజము. “ఇంకొక ప్రక్క నీ ముఖము త్రిప్పుకో తల్లి తట్టెందుకు?” అని పిల్లతో అంటే, నీ నైజమును త్రిప్పుకో! అని అన్నట్లే! పిల్ల తల్లి తట్టు ముఖము తిప్పితే తప్పా! ఆలాగే సంఘము ఈ దినము తన ముఖమును ప్రభువు తట్టుకు త్రిప్పుకొన్నది. గనుక అబ్రాహాము వలె “నేను బూడిదను, ధూళిని”, ఇట్టి నా కొరకు నీవు పొందిన శ్రమలు చూస్తూ; నావైపు, నా పాపమువైపు చూచుచు,’ నాకు బదులుగా ఇట్టి శ్రమపొందిన నీవైపు చూస్తున్నాను. అని అనుచున్నది. ఇదే భస్మ బుధవారము. ఓ సంఘమా! ఓ ప్రొద్దు తిరుగుడు పువ్వా! ఆయన వాగ్దానాలు, ఆయన గుణాలు, ఆయన చరిత్ర, ఆయన శ్రమ, మరణాలవైపే చూడు. ఎందుకంటే ఇక ముందుకే శ్రమలు, మరణము, తీర్పు, వేదన ఉండవు. ఎందుకంటే ఆయనను గుడిలో, ఇంటిలో తలంచి, స్తుతించి ఆయన చిత్త ప్రకారము చేసిన యెడల, ఆయన శ్రమల రూపములో పాలిభాగస్థురాలివై, ఆయన మహిమ రాకడలోని జయమునకు ఆయత్తప డగలవు.

       ఈ శ్రమకాల ధ్యానము ద్వారా అట్టి స్థితి చదువరులకు సిలువనాధుడైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక! ఆమేన్.

కీర్తన: “ సిలువను జూచు కొలది – శిల సమాన మైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నదిరా”  

                                                     “నీ సిలువే”

 

Click  here to read lent related sermons

bible mission, bible mission gooty, bible mission kakani, devadas ayyagaru, bible mission books

Share this now. Choose your platform