క్రీస్తు మానవ అవతార సిలువ

1తిమోతి 2:5 – 6; హెబ్రీ 2:14 -18;5:7-10.

ప్రార్ధన :- పరిశుద్ధాత్మవైన తండ్రీ!మమ్మును నడిపించుము. ఆమేన్.

దీవెన: సిలువధ్యానము కొరకు ఆశించుచున్న వారాలరా ! సిలువ ధ్యానము విలువ ధ్యానమై యున్నది. అట్టి సిలువ ధ్యానము మనలో నిలువ ఉండే ధ్యానమై ఉండునుగాక!

దేవుడు దేవుడుగానే ఉంటే, కనబడకుండ ఉంటే; కేవలము ఆయనవల్ల కలిగే మేళ్ళ వల్లనే మనము సంతుష్టిపడము. కాబట్టి ఆయన మనకు కనబడవ లెను. ఆలాగు కనబడుటకు నిరాకారుడైన దేవుడు ఏలాగు కనబడగలడు? మనిషి చాలా చిక్కులలో ఉన్నాడు. గనుక మనకొరకై కనబడుటకై ఆయన మనిషైనాడు.

ఉదా : ఒక కుటుంబములో కుమారుడు అమెరికా వెళ్లి ఐదు సంవత్సరముల వరకు ఉత్తరములు వ్రాస్తూ, వస్తానని చెప్పుచూ కాలము గడిపితే తల్లిదండ్రులకు సంతుష్టి ఉండునా? ఉండదు. కొడుకు రావలెను. ఆలాగే దేవుడు పరలోకములో ఉండి, మనకు కనబడకుండా ఎన్ని మేళ్లు చేస్తేమట్టుకు మనకు సంతుష్టి కలుగునా? దేవుడు మనిషిగా వస్తే, అప్పుడు మనకు సంతుష్టి కలుగును. దేవుడు వస్తే మంచిదే గాని ఆయన మనకు కనబడకపోతే వచ్చిన ప్రయోజనమేమి? ఏమి ప్రయోజనము లేదు. దర్శనములో కనబడితే, అప్పుడైనా అది ఆయన ఆకారముతో కాదు. ఆయన మన స్వరూపముతో కనబడుటే కావాలిగాని ఆయన ఆకారము కాదు. మనలను సంతుష్టి పరచవలెనంటే మన ఆకారములో, మన శరీరముతో, మనవలె, కేవలము మనవలె వచ్చి కనబడితే అప్పుడు సంతుష్టి, అయితే నాటకములో పురుషులు స్త్రీ వేషము ధరించుకొని వస్తారు. ఎంత స్త్రీ వేషము వేసికొన్నను, చూచేవారు స్త్రీ అనుకొనరు. ఎందుకంటే అది వేషము, నిజ స్వరూపము కాదు,

ఒక బ్రాహ్మణుడు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ ముగ్గురిలో విష్ణువు జగన్మోహిని వేషము వేసికొన్నాడు, నాటకములో వేసికొనే వేషము వంటిదికాదు. ఆయన (విష్ణువు) కేవలము స్త్రీ అయిపోయినాడు’ అని అన్నాడు, అదే మన సిధ్ధాంతముకూడా,

           దేవుడు దేవుడుగా భూలోకమునకు రాలేదు కేవలము మనిషిగా వచ్చినాడు. తాను ఎంత మనిషిగా వచ్చినప్పటికినీ తాను దేవుడనే జ్ఞప్తి ఉన్నది. బైబిలులో ఒక కథ ఉన్నది. బబులోను దేశపు రాజు మృగమైపోయాడు . శాపమువల్ల మృగమై అడవి జంతువులలో ఉన్నాడు. గాని తాను రాజు అనియు, మనిషి అనియు మరచిపోలేదు. అది జ్ఞాపకమున్నది. అయ్యో! నేను మనిషిని, జంతువునైపోతినే! అనే చింత ఉన్నది. దేవుడు ఆ జంతు రూపము తీసివేసి మనిషి రూపము ఇస్తే ఎంత సంతోషము! ఇది దానియేలు గ్రంధములో 4:32-33 గలదు.

      మనిషి మృగమగుట భయంకరము. అలాగే దేవుడు మనిషి అగుట ఎంతో భయంకరము. ఎంతో కష్టము! దేవుడు మన నిమిత్తము యేసుక్రీస్తు అనే మనిషి అయినాడు. మనలో ఈ వరండా మీద ఉన్నవారిలో ఎవరైనా ఒకరు అడవి మృగము  అయిపోయి నక్క లాగమారి, మరలా మనిషిగా వస్తే, ఇక్కడకు వస్తే (ఆ వచ్చిన మనిషి : నక్కకు లేక నక్క మనిషికి ఎంత సంతోషము!) గనుక అనాది దేవుడు, ఆకారములేని దేవుడు, ‘పుట్టుక మరణమున్న మనిషిగా’ మారిపోవుట ఎంత కష్టము! మనిషి నక్కగా మారుట ఎంత కష్ణమో ఆలాగే దేవుడు మనిషి అగుట అంత కష్టము.  నెబుకద్నెజరు అడవిలో గడ్డి మేసేటప్పుడు అతనికెంత కష్టమో ఊహించలేము. ఇది మన స్వంత  అభిప్రాయమునకు పనికిరాక పోవచ్చును అనగా అందక పోవచ్చును.

      యేసుప్రభుఫు సిలువమీద కష్టాలు అనుభవించుట కంటే, ఆయన అసలు మనిషి అగుటయే గొప్ప సిలువ (శ్రమ ). తాను దేవుడై ఉండక, తాను కలుగజేసిస స్త్రీ గర్భములో మనిషై ఉండడము అంతకంటే చావు ఇంకొకటి ఉన్నదా? అంతకంటే సిలువ ఇంకొకటి ఉన్నదా? గ్రహించు కొనండి. మన నిమిత్తమై మన మనిషైనాడు. ఒక ప్రయాణస్థుడు యెరూషలేమునుండి బేతనియ వెళ్లుచున్నప్పుడు, ‘అయ్యో! నేను ఒంటరిగా అయిపోయాను, చీకటిపడ్దది’ అని అనుకొనేటప్పుడు, భయపడేటప్పుడు, ఎదుట  బేతనియకు వెళ్లుచున్న యేసు ప్రభువు కనబడితే, ‘ఎవరో మనిషి వెళ్లుచున్నాడు!’ అని ధైర్యము తెచ్చుకుంటాడు. అయితే దేవుడు వెళ్లుచున్నాడని తెలిస్తే భయపడిపోతాడు. అక్కడే ఆగిపోతాడు, దాగుకొంటాడు. అయితే మనిషి గనుక ఆయన లోపల ఎంత దేవుడైననూ, మనిషిగానే ఉన్నాడు గనుక నిర్భయముగా దగ్గరకు వెళ్లగల డు, మరియొక  బాటసారి దగ్గరకు వస్తున్న ఆ బాటసారితో ఆయన దేవుడు సుమీ! అన్నప్పటికిని ఇతనికి భయములేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనిషిగా కనబ డుచున్నాడు గనుక భయములేదు.

       మనిషికైతే సంతోషమే గాని క్రీస్తుకైతే దైవత్వము విడిచి మనిషైనాడు గనుక ఆయనకు ఏమి సంతోషము! ఒక మనిషి నక్కైన యెడల అతనికి ఏమి సంతోషము? కాబట్టి క్రీస్తు నరావతారిగా ఉండడమే జీవితమంతా ఉండే గొప్ప సిలువ. క్రీస్తు గర్భములో ప్రవేశించినది మొదలు కల్వరి మీద సిలువమీదికి వెళ్లేవరకు అంతా సిలువే. కర్ర మీద ఉన్నప్పుడు మాత్రమే సిలువకాదు. జీవితమంతా ఆయనకు సిలువే. మన నిమిత్తమై అంత మట్టుకు ఆయన తగ్గించుకొన్నాడు గనుక మనము ఆయనకు ఎంతగా వందనములు ఆచరించవలెను! (1తిమోతి 2:5).

‘క్రీస్తుయేసు అను నరుడు’ అని ఉన్నది గాని ‘క్రీస్తుయేసు అను దేవుడు’ అనిలేదు. గనుక అయన అవతారము వేషముకాదు గాని కేవలము నరుడే.

ఒకప్పుడు జరిగిన సంగతి మీకు చెప్పుదును, అదేదనగా ఇద్దరు క్రైస్తవ రోగులు యేసుక్రీస్తు యెుక్క శరీరమును తలంచుకొని, ఒకడు ఈ ప్రక్కను ఉండి క్రీస్తు కేవలము మనుష్యుడేనని వాదించెను. ఇంకొకరు ఆ ప్రక్కన ఉండి నీవు పొరబడుచున్నావు ఆయన మనిషేగాని దేవుడుకూడా అయియున్నాడు అని వాదించెను. ఆ వాదము మిగుల మగ్గిపోయెను. అప్పుడు అతడు ఆ ప్రక్క నుండి, ఇతడు ఈ ప్రక్క నుండి గుద్దుకొన్నారు. ఏమి ప్రయోజనము! వాదమువల్ల ఏమి వస్తుంది? వాదమువల్ల బుద్దిరాదు గాని, గుద్దులాట వస్తుంది గనుక ఉన్నది ఉన్నట్టుగా నమ్మవలెను.అంతరంగమున కూడా నమ్మవలెను.

      ఇప్పుడు మనమున్నాము. మన శరీరము కనబడుచున్నది. గాని మన ఊపిరి కనబడుచున్నదా? లేదు. అయినను రెండును నమ్ముచున్నాము, అలాగే క్రీస్తు దేవుడనియు, మనిషి అనియు రెండునూ నమ్మవలెను కాని ఆయన మనిషిగా మారడము ఆయనకు సిలువ. కాని మనకు సిలువకాదు. ఆ సిలువను మనము గౌరవించితే మనకు విలువ యున్నది. ఎందుచేతనంటే ఆయన మనిషి అవడము అవమానము పొందడమే. ఆయన శ్రమలు అనుభవించడము, సిలువ మీద మరణము పొందడము మనకు విలువ.

      పాట: కులగోత్రముల బుద్ధి కుటిలంబు దెగెరా – బలవత్పి శాచ శృంఖలము విరిగెనురా – సిలువమోసిన వాని మా యేసుక్రీస్తని మరుగు గల్గెనునురా

        క్రీస్తు సిలువను బడితే ఆయన శరీరమునకు నష్టము గాని పిశాచికేమి నష్టము? శృంఖలము అనగా (పాపపు) సంకెళ్లు వదలిపోయి సైతానుకు సిలువ అయినది. అయ్యగారు ఒక పేపరు వేసిరి పైన ప్రభువు సిలువ అయితే క్రింద సైతానుకు సిలువ. గనుక ప్రభువుకు సిలువ కాదు. పిశాచికే సిలువ. ఉదా: మోషే అరణ్యములో ఇత్తడి సర్పమును స్తంభము మీద నెత్తెను. ఆ ఇత్తడి సర్పమే పిశాచి. ఆ పిశాచికే సిలువ. మనమందరము

  యేసుక్రీస్తు కే సిలువ అనుకొంటున్నాము గాని, ఆ సిలువ క్రింద సైతానుకు సిలువ.

సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కిస్తాను (రోమా 16:20) అని బెబిలులో ఉన్నది గదా!

యేసుప్రభువు సిలువ మీద ఉండగా ఆయన పాదములక్రింద సైతానును త్రొక్కివేసినాడు గదా! ఆలాగే మనచేత కూడా త్రొక్కిస్తాడు. సైతాను వల్ల, సైతాను దూతలవల్ల, సైతాను మను ష్యులవల్ల బాధలు పడుచున్నవారలారా! మీ మీదికి గొప్ప ఆదరణ కలిగించునుగాక!

సిలువ మీద నున్న క్రీస్తుయెుక్క పని:

1) శత్రువులు తనకు హాని చే స్తున్నప్పటికిని, ప్రభువు వారిని క్షమించుటకు కోరినాడు ఇది మను ష్యుని లక్షణమునకు విరు ద్ధము. మనుష్యులు తమ్మును హింసించువారిని హింసింపుమని కోరుదురు గాని క్షమించుమని కోరరు. అయితే క్రీస్తు తన విరోధులను క్షమించెను. 2) క్రీస్తు శ్రమపడుచున్నను, దొంగను పరదైసుకు తీసికొని వెళ్లెను. గనుక రక్షించే పని మీద ఆయన వచ్చినాడు. గనుక శ్రమలోనున్నను రక్షించే పనిమానలేదు. 3) యోహానునకు తన తల్లిని అప్పగించెను. ఆయన దేవుడైనప్పటికిని, ఈ లోక మనుష్యులతో బంధుత్వము కలిగించుకొన్నాడు గనుక ఆ బంధుత్వము చివరివరకు పోగొట్టు కొనలేదు. 4) వారు ఆయనను చేతులలో మేకులతో కొట్టినారు. అయినప్పటికి ఆయన రెండు చేతులు చాపి లోకమును దీవించుట మానలేదు. ఆయన చేతులు చూడగా లోకమును దీవించుచున్నట్లు అగుపడును. 5) ఆయన వేదనలో ఉన్నప్పటికిని ఏడ్చే స్త్రీలను ఓదార్చినాడు. బాగా ఉన్నవారు ఓదార్చుదురుగాని వేదనలో ఉన్నవారు లోకములో ఎక్కడ ఎవరినీ ఓదార్చరు. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పటి కిని, పెండ్లి కుమార్తె సంఘమును తన ప్రక్కకు చేర్చుకొనినాడు.

ఈలాగు ఆయన శ్రమల కౌగిలిలోనికి చేరి, ఆయన అంతరంగమును ఆనందింపజేయు ధన్యత నేటి దినమున ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.

కీర్తన :- “నరరూపు బూని ఘోర – నరకుల రారమ్మని – దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరవుత్రుడు = కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి – గి రయరిబున ప్రభు – కరుణను గనరే” 

                                                    “వినరే యో” 

Share this now. Choose your platform