బదిలీయైన ప్రభువు

రోమా 8: 3, 4.

ప్రార్థన:తండ్రీ! మా పాపమును బట్టి మేము శిక్షకు పాత్రులమైయుండగా  మాకు బదులుగా నీవే ఆ శిక్షనంతటిని నీపై వేసికొని మాకు శిక్ష లేకుండా చేసినందుకు వందనములు. మేము చేయలేనివన్నీ మా పక్షమున చేసిన తండ్రీ నీకు నమస్కారములు. మా బదిలీయైన నీవే నేడు మాకు వర్తమానమిమ్మని యేసు నామమున వందించు చున్నాము. ఆమేన్.

      ఈ పాఠములో పాపమునకు విధింపబడిన శిక్షనుగూర్చి చెప్పుచున్నాను, ఇది ప్రభువునకు విధింపబడిన శిక్ష. రోమా 8వ అధ్యాయములో ప్రభువు శరీరమందు పాపమునకు శిక్ష అని వ్రాయబడియున్నది. ఇది పాపమును గురించిన శిక్ష. ఆదాము, హవ్వలయొక్క శరీరములో పాపము ప్రవేశించినది. కాబట్టి మానవ శరీరములో పాపమునకు రాజ్యము ఏర్పడినది. శరీరము ఓడిపోయినది, పాపమే గెల్చినది. క్రీస్తు చరిత్రలో కథ తిరగబడినది. ఎట్లనగా పాపము ప్రభువుయెుక్క శరీరములో ప్రవేశింపలేక పోయినది. ఆయన శరీరము పాపములేని మానవ శరీరము గనుక పాపము వెలుపట ఉండి పోయినది. ఇదే పాపమునకు శిక్ష, కాగడా చుట్టూ దోమలు తిరుగవచ్చును గాని కాగడా లోపలకు వెళ్లలేవు. అట్లే ఏ పాపమైనా, శోధనయైనా, ఏ దయ్యమైనా, సాతానైనా ప్రభువును సమీపింపవచ్చు, శోధింపవచ్చు గాని ప్రభువు లోనికి వెళ్లలేవు, అయితే ఆయన వాటన్నిటి నిమిత్తము శిక్ష పొందితేనే గాని జయము పొందవీలులేదు. అరణ్యములో సైతాను వచ్ఛే స్థలమునకు ప్రభువు వెళ్లుట. అతని పని పట్టుటకే గాని అతనివల్ల జయింపబడుటకు కాదు.

      గెరాసేనీయుల స్మశాన భూమికి ప్రభువు వెళ్లుట సైతానుయొక్క పటాలమును వెళ్లగొట్టుటకే, జయించుటకే గాని ఓడిపోవుటకు కాదు. ఆదాముయెుద్దకు సర్పమును దేవుడు వెళ్లనిచ్చుట ఆదామువల్ల సర్పమును ఓడింపజేయుటకే గాని ఆదాము ఓడిపోయెను. తానే గెలిచిన యెడల సర్పమునకు గొప్ప పరాభవము, శిక్ష కలిగి యుండును. అది ప్రభువు యెుక్క శరీరము నందు జరిగినది. మొదటి ఆదామువద్ద జరగలేదు గాని రెండవ ఆదామైన క్రీస్తునొద్ద జరిగెను. ఆదాము హవ్వలను పాపములో పడవేసినట్టు, క్రీస్తు ప్రభువునుకూడా పడనేయవలెనని సాతాను అనేకమార్లు ప్రయత్నించెను. ప్రతి ప్రయత్నములో పరాభవము, అపజయము అతనికి కలిగెను. సాతానులోనుండి పాపము వచ్చెను. పాపములోనుండి మానవులకు అనగా పాపమునకు లోబడినవారికి శిక్ష అను పాప ఫలితము వచ్చెను. ప్రభువునకు జన్మములో పాపములేదు, క్రియలో పాపములేదు. కాబట్టే పాపమునకు రావలసిన శిక్ష ఆయనకు రాకూడదు గానీ, ఆయన మనకు బదులుగా వచ్చి నందున శిక్ష అనుభవించెను.

       ఉదా:ఒక పంతులుగారు వెళ్లగా ఇంకొకరు వచ్చును. ఈ బదిలీ పంతులు గారు మొదటి పంతులుగారు చేసిన పనులు అన్నీ చేయవలెను. అలాగే మనము పాపము చేయగా పాపములేని ఆయన మన శిక్ష అనుభవించెను. ఆయన అక్రమ కారులలో ఒకడాయెను. ఒక ఉపాధ్యాయుడు ఒక నెల సెలవుమీద వెళ్లినప్పుడు, ఆయనకు బదిలీ ఉపాధ్యాయుడు ఆ  పంతులు గారి పనులన్నీ చేయవలెను! చేసినంత మాత్రమున ఆయన అసలు పంతులు కాగలడా! కాలేడు. అట్లే పాపాత్ములమైన మనకు బదిలీ ప్రభువైయున్నాడు. కాబట్టి నేను చేయలేనివన్నీ ఆయనే చేసెను. ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించెను. పాప ఫలితము అనుభవించెను. అంత మాత్రమున ఆయన పాపికాడు. ఆ పాపము చేసినవాడు శిక్షార్హుడు గాని, పాపము మోసిన వాడు శిక్షార్హుడు కాడు, మన శిక్ష వహించినవాడుగా, అక్రమకారులలో ఆయన ఒకడుగా ఎంచబడెను, యెషయా 53:12; లూకా 22:37. పంతులుగారి బదిలీకంటే, మన కొరకు బదిలీ చేయవలసినది ఎక్కువ గనుక అన్నిటినీ ఆయన చేయువాడైయున్నాడు. లూకా 10:35. కీర్తన: ‘నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు’.

నీ పాదములు నేను కడిగితేనే గాని నాతో నీకు పాలులేదని (పవిత్రుడవు కావని) ప్రభువు పేతురుతో చెప్పలేదా! (పేతురు కాళ్ళే కడుగుకొనలేడా?) కడుగుకొనలేడు. ఎట్లు కడుగుకొనలేడనగా తన కాలికి అంటిన బురద పోవునట్లు కడుగుకొనగలడు గాని ప్రభువు యెుక్క భాగ్యములో పాలు దొరికేటంతగా కడుగుకొనలేడు. ప్రభువు కడిగితే ఆయన ఆస్తిలో పాలుపొంపులు దొరకగలవు. మనము ప్రతిరోజు కాళ్లుకడుగుకొనుచున్నాము. అంత మాత్రమున పరమ భాగ్య వంతులము కానేరము. అట్టి వారమగుటకు మనము చేయలేని పనియగు ‘కడుగుటను’ ప్రభువే చేయవలెను. మనమైతే బాప్తిస్మబలము కలిగియుండగలము గాని బాప్తిస్మమువల్ల ఏర్పడు బంధుత్వమును కలిగియుండలేము. మనమైతే రొట్టె తినగలము గాని ద్రాక్షారసము త్రాగగలముకాని ప్రభువుయెుక్క శరీరమును కలిగియుండలేము. గనుక మనము చేయలేని అనేక కార్యాలు ప్రభువు చేయుటకై, ఆయన నరావతారియైనాడు. ఆయన ఇంకా ఏమి చేయుచున్నాడు? మన కొరకు స్థలము సిద్ధపర్చుటకై వెళ్లుచున్నానని ప్రభువు చెప్పలేదా! యోహాను 14:3. మనమీద నున్న శిక్షను పరిహరించుటకు, మనకు రావలసిన సంపద గడించిపెట్టుటకు; ఈ రెండు పనులు చేయుట వల్ల ప్రభువు మన నమ్మకమైన బదిలీయైయున్నా డు.

శిక్షలు:- 1) శిక్షలు ఏవనగా వ్యాధి, కరువు, అనుకొనని ఆపద మొదలైనవి తాత్కాలిక శిక్షలు అనగా మరణ సమయము వరకు కలిగే శిక్షలు. 2) మరణము మరియొక శిక్ష .3) పాతాళము మరియొక శిక్ష. 4) నరకము అనగా రెండవ మరణము. ఇది అంత్య శిక్ష. ఈ శిక్ష మనకు లేకుండునట్లు ఆయన తన మరణమువల్ల మార్గమేర్పరచెను, అందుచేతనే క్రీస్తుయేసునందుండు వారికి ఏ శిక్షావిధిలేదని వ్రాయబడెను, రోమా 8:11. మరణ పర్యంతము భక్తులకు, ఇతరులకు కలిగే శిక్షలు, వారిని కడవరి శిక్షను తప్పించే సాధనములై యున్నవి. గనుక అవి ఉపయోగకరములే. ఈ శిక్షలవల్ల మూడు పనులు జరుగును. 1) పాపమును విసర్జించే మారుమనస్సు, 2) ప్రభువును అనుసరించే స్వభావము, 3) ఆత్మీయ జీవనముయెుక్క అభివృద్ది విషయములో కలిగే అనుభవము. ఈ శిక్షలు పేరుకు మాత్రమే శిక్షలు గాని ఇవి నిజమైన మేళ్లైయున్నవి. నా కుమారుడా, నీ తండ్రి శిక్షించు శిక్షను నిర్లక్ష్యపెట్టకుము అనే వాక్యము ఇక్కడ అన్వయించును. మరియొక విశేషమేదనగా క్రీస్తు యొక్క జీవితభాగములు. 1) జన్మము మొదలుకొని 12 ఏండ్ల వయస్సు వరకు 2) అక్కడ నుండి 20 ఏండ్ల గృహ నివాసము వరకు, 3) అక్కడనుండి సిలువ వేత వరకు. ఇవి ఆయన సేవ కాలములు. ఏ భాగములోనైనా, ఆయన పాపమునకు లోబడలేదు. తల్లిదండ్రులయెడల అవిధేయత, అరణ్యములోని సైతాను మాటలకు లొంగిపోవలసిన విధేయత, సిలువవేత వరకు కలిగిన కష్టములకు దిగులుపడిపోవుట ఈ మొదలైనవి ఆయనలో లేవు గనుక పాపమునకు ఆయన శరీరములోనే శిక్ష కలిగెను.

అటువంటి క్రీస్తు శరీర స్వభావమును మీరును ధరించుకొందురు గాక. ఆమేన్.

కీర్తన :-“నా ఋణము తీర్చినా – నా దేవా! నా ప్రభువా! – నీ ఋణము తీర్చగలనా! =

నీవు – నా బుుషివై బోధించి – నా బదులు చనిపోయి – నావని మరువగలనా”               “మూడు“ 

Share this now. Choose your platform